తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందిని అనే మహిళ మూడేళ్ల వయసున్న కన్నకూతురికి మద్యం తాగించి, అతికిరాతంగా హింసించింది. భర్త నుంచి విడిపోయిన ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మంగళవారం ఇద్దరు కలిసి మద్యం సేవించిన అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
నందినికి మాదేశ్ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. అయితే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల నందిని తన కూతురుతో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.
ఈ క్రమంలో ఆమెకు అశోకన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. మంగళవారం ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అనంతరం మూడేళ్ల చిన్నారికి కూడా బలవంతంగా ఆల్కాహాల్ నోట్లో పోసి తీవ్రంగా కొట్టింది నందిని. బాధను తట్టుకోలేక ఆ చిన్నారి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు చిన్నారిని రక్షించి, వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలిక శరీరంపై తీవ్ర గాయలైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: సెంట్రల్ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత