మనుషుల ఆలోచనా విధానంలో మార్పు వస్తేనే మహిళలపై అకృత్యాల నివారణ సాధ్యమవుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మహారాష్ట్ర పుణెలోని సింబియోసిస్ అంతర్జాతీయ డీమ్డ్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కొత్త బిల్లులు తీసుకురావడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.
రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్
దేశం అత్యాచారాలకు రాజధానిగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల పరోక్షంగా స్పందించారు వెంకయ్య. ఇలాంటి మాటల వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు.
"మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా సత్తా చాటతారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో మహిళను తల్లిగా, సోదరిగా పరిగణిస్తాం. కాని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? నిజంగా ఇది సిగ్గుచేటు. మనకు ఇది సవాల్ లాంటిది. మహిళలపై వివక్ష, దాడులు వెంటనే ఆగిపోయేలా చూసేందుకు యువత ప్రతిజ్ఞ తీసుకోవాలి. మహిళల మీద జరిగే ఆకృత్యాలను మతం, ప్రాంతం రాజకీయం అనే కోణంలో చూడరాదు. రాజకీయ కోణంలో చూస్తే.... ఆకృత్యాలను నివారించాలన్న అసలు లక్ష్యం దెబ్బతింటుంది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినపుడే మహిళలపై దాడులు ఆగుతాయి. కొత్త చట్టాలు తేవడం దీనికి పరిష్కారం కాదు. కొత్త బిల్లులు తీసుకురావడానికి నేను వ్యతిరేకం కాదు. నిర్భయ బిల్లు తీసుకువస్తే ఏం జరిగింది? సమస్య పరిష్కారమైందా?"-వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి