ఈసారి ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్‌లో బాబా కేదార్ యాత్ర ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ యాత్ర భక్తులకు మాత్రమే కాదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, చిన్నా పెద్ద వ్యాపారాలకూ మేలు చేసింది. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ, గఢ్వాల్ మండల అభివృద్ధి సంస్థలకు ఎన్నడూ లేనంత స్థాయిలో రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఘాట్‌లో నడుస్తున్న 800కు పైగా హోటళ్ల వ్యాపారవేత్తలకు 125 కోట్లకు పైగా రాబడి చేకూరింది.
కాలినడకతో ఆదాయం
2019 మే 9న ప్రారంభమైన ఈ యాత్రలో కేవలం గుర్రపు బండ్ల నుంచి 55 కోట్ల రూపాయల టర్నోవర్, ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయల ఆదాయమూ వచ్చిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సారి భక్తులు కాలినడకన స్వామి దర్శనానికి రావటమే దీనికి కారణం. అందుకే గుర్రాలు, మ్యూల్‌లను ఎక్కువగా ఉపయోగించారు పాదచారులు.
ఇక చిన్న దుకాణాలు, దాబాలన్నీ కలిపి రూ. 40 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందాయి. ప్రత్యేక విషయం ఏంటంటే, యాత్రలో భక్తులు పహారీ వంటకాలను కూడా బాగా ఉపయోగించుకున్నారు. సోన్‌ప్రయాగ్‌లో పహారీ కిచెన్ నిర్వాహకులు ఈ ఏడాది కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు.
ఈటీవీ భారత్‌తో ఫోన్లో మాట్లాడిన రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మంగేష్ గిల్దియాల్ 'ఈసారి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా, సురక్షితంగా ఉందనీ, అదే సమయంలో ఈ యాత్ర ఆదాయ పరంగా పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని' తెలిపారు.
మోదీ ప్రభావం
సుమారు 10 లక్షల మంది భక్తులు కేదార్ బాబా దర్శనానికి విచ్చేశారు. ప్రధాని మోదీ కేదార్ ధామ్‌ను సందర్శించాక ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ఈ ఏడాది యాత్ర సమయంలో భారీ వర్షాల కారణంగా యాత్రికులు, భక్తులు 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని తేలింది. శీతాకాలం దృష్ట్యా.. కేదార్‌నాథ్ ఆలయాన్ని ఈ అక్టోబర్ 29న మూసివేశారు.
ఇదీ చూడండి:జల్లికట్టు బసవన్న మృతికి ఊరంతా దిగ్భ్రాంతి