అమెరికాలో చట్టబద్ధ శాశ్వత నివాసం లేదా కుటుంబ ప్రాయోజిత గ్రీన్‌కార్డు కోసం 2,27,000 మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని తాజా అధికారిక సమాచారం. అయితే ట్రంప్ ప్రభుత్వం విధించిన పరిమితి ప్రకారం 2,26,000 మందికి మాత్రమే ప్రతియేటా ఈ అవకాశం దక్కుతుంది.
ప్రస్తుత సంవత్సరానికి ఈ కుటుంబ ప్రాయోజిత గ్రీన్‌కార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 మిలియన్ల మంది పడిగాపులు కాస్తున్నారు. ఈ నిరీక్షణ జాబితాలో మెక్సికో.. సుమారు 1.5 మిలియన్ మంది ఆశావహులతో ముందు వరుసలో ఉంది. తరువాతి స్థానాల్లో భారత్ (2,27,000), చైనా (1,80,000) ఉన్నాయి.
తోబుట్టువులు...
'కుటుంబ ప్రాయోజిత గ్రీన్‌కార్డ్' నిరీక్షణ జాబితాలో ఉన్నవారిలో ఎక్కువ మంది అమెరికా పౌరులకు తోబుట్టువులే. ప్రస్తుత చట్టం ప్రకారం అమెరికా పౌరులు... తమ కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులకు గ్రీన్‌కార్డు కోసం స్పాన్సర్ (దరఖాస్తు) చేయవచ్చు.
డీహెచ్ఎస్ ప్రకారం, కుటుంబ ప్రాయోజిత గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది అమెరికా పౌరులకు తోబుట్టువులు. వారి సంఖ్య 1,81,000 కంటే ఎక్కువ. దీని తరువాత యూఎస్ పౌరుల జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు 2500 మంది. అలాగే వారి వివాహితులైన పిల్లలు.. 42 వేల మంది ఉన్నారు.
శాశ్వత చట్టబద్ధ నివాసం కోసం
అమెరికాలో శాశ్వత చట్టబద్ధ నివాసం కోసం మరో 8,27,000 మంది భారతీయులు నిరీక్షిస్తున్నారు. అలాగే ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం భారతీయ ఐటీ నిపుణులు దశాబ్దకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రంప్ వ్యతిరేకత..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ ప్రాయోజిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ ట్రంప్ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇదీ చూడండి: నిజాయతీకి బదిలీ బహుమానం-ఖేమ్కా.. 53వ సారి