ప్రధాని నరేంద్రమోదీ....ఇవాళ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ప్రారంభమై..3రోజులపాటు జరిగే అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు.
'దావోస్ ఇన్ డెసర్ట్' పేరుతో రియాద్..ఈ వ్యాపార సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.
సౌదీ అగ్రనేతలతో భేటీ కానున్న మోదీ..
ఈ పర్యటన సందర్భంగా సౌదీ అరేబియా అగ్ర నేతలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు చమురు సరఫరా అంశంపై చర్చించనున్నారు.
మోదీ విమానానికి పాక్ నో...
సౌదీ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ విమానం...తమ గగనతలం నుంచి ప్రయాణించేందుకు పాక్ అనుమతి నిరాకరించింది. కశ్మీర్‌లోని మానవహక్కులను ఉల్లంఘిస్తున్నారని అందుకు కారణంగా చూపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని భారత హైకమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు.
గతనెలలోనూ ఇంతే..
గతనెలలో ప్రధాని మోదీ.. అమెరికా పర్యటన సందర్భంగానూ పాక్ తమ గగనతలం నుంచి విమానం వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. బాలాకోట్ దాడుల తర్వాత కొంతకాలం తమ గగనతలాన్ని మూసివేసిన పాక్.. కొద్ది రోజుల అనంతరం తెరిచింది. ఇటీవల ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో భారత విమానాలు ప్రవేశించకుండా తమ గగనతలాన్ని మూసివేసింది పాక్.
ఇదీ చూడండి: 'మహా' పీఠం: స్వతంత్రుల మద్దతు వేటలో భాజపా-సేన