మోదీ ప్రభుత్వం... సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
"ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు వ్యక్తిగత కక్షతో ప్రతీకారం తీర్చుకోవాలనే ధ్యాసతో ఏదీ కనిపించడం లేదు. వారికి చట్టం అంటే లెక్కలేదు, రాజ్యాంగంపై గౌరవం లేదు, ప్రజాతీర్పును పట్టించుకోరు. తమ రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎంతటికైనా తెగిస్తారు." - రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
అమిత్‌షాకు నిరసన సెగ
గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసం ముందు నిరసన చేపట్టారు. వెంటనే గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
సీఆర్పీఎఫ్ అధీనంలోకి
రాహుల్‌కు ఎస్పీజీ భద్రత తొలగించిన నేపథ్యంలో తుగ్లక్ లేన్‌లోని ఆయన నివాసం - నెం.12 భద్రతను సీఆర్పీఎఫ్ దళాలు చేపట్టాయి. జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసం భద్రతను కూడా సీఆర్పీఎఫ్ తన అధీనంలోకి తీసుకుంది. ఇకపై గాంధీ కుటుంబసభ్యలకు సీఆర్పీఎఫ్ సిబ్బంది జెడ్ ప్లస్ సెక్యూరిటీని అందజేయనుంది.
మోదీ భద్రతకు 3000 దళాలు
తాజా చర్యతో 3000 మంది భద్రతా సిబ్బంది ప్రధాని మోదీకి మాత్రమే కాపలా కాయనున్నారు.
ఉగ్రచర్యలకు గాంధీలు బలి
గాంధీ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఇద్దరు నేతలు భద్రతా వైఫల్యం కారణంగా అసువులు బాసారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బందే హత్య చేశారు. తరువాత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు హత్య చేశారు. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత కొనసాగుతోంది. తాజాగా దానిని మోదీ ప్రభుత్వం తొలగించింది.
ఇదీ చూడండి: మోదీ చేతులమీదుగా రేపు కర్తార్‌పుర్ ప్రారంభం