కర్ణాటక దావణగెరె జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలు వేరే పెళ్లికి సిద్ధమైందని తెలుసుకుని, నిలదీసిన ప్రియుడిపై కిరోసిన్ పోసి సజీవంగా నిప్పంటించింది ఓ యువతి.
ఇదీ జరిగింది
హరప్పనహళ్లికి చెందిన పరాసప్పా, ఓ యువతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువతి అతడికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఇద్దరి కులాల వేరంటూ మరొకరితో పెళ్లికి సిద్ధమైంది. నిశ్చితార్థం కూడా చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ప్రియురాలి ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. యువతి క్షణాలలోనే పరాసప్పాపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.
వెంటనే పరాసప్పా మంటల ధాటికి తట్టుకోలేక పరుగులు తీశాడు. పక్కనే ఉన్న గడ్డివాము మీదకు దూకాడు. ఫలితంగా మంటలు మరింత వ్యాపించాయి. గ్రామస్థులు హుటాహుటిన మంటలు ఆర్పారు. యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు పరాసప్పా... సగం కాలిన గాయాలతో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి : అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్న 'లేడీ రోబో'