రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని మథురాదాస్ మాథూర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు అద్భుతం సృష్టించారు. హృద్రోగ వైద్యంలో అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి చరిత్ర లిఖించారు. కాల్షియంతో గుండె నాళాలు(ధమనులు) మూసుకుపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న 80 ఏళ్ల వృద్ధుడికి.. సరికొత్త 'ఇంట్రా-వాస్కులర్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ టెక్నిక్'తో పునరుజ్జీవం పోశారు. అంతేకాదు ఈ సరికొత్త విధానాన్ని సమర్థమంతంగా వినియోగించిన దేశంలోని మొట్టమొదటి ప్రభుత్వాసుపత్రి వైద్యులుగా గుర్తింపు పొందారు.
కాల్షియంతో మూసుకుపోయిన ద్వారాలను సాధారణ శస్త్ర చికిత్సతో తొలగించలేము. ఒకవేళ అలా ప్రయత్నిస్తే... నాళం తెగిపోయే అవకాశం ఉంది. అందుకే వృద్ధుడి ప్రాణాలకు అపాయం కలుగకుండా సరికొత్త టెక్నిక్‌ను ఉపయోగించినట్లు డాక్టర్ పవన్ సార్ఢా తెలిపారు.
"80 ఏళ్ల ఈ వృద్ధుడికి నడకతో పాటు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉండేవి. ఎన్జీయోగ్రఫీ పరీక్ష చేసినప్పుడు ఆయన హృదయంలోని మూడు నాళాలు కాల్షియంతో మూసుకుని ఉన్నట్టు గుర్తించాం. వృద్ధాప్యంలో బైపాస్ చేయడం కష్టం.. పైగా కాల్షియం నిండి ఉండటం వల్ల ఎన్జీయోప్లాస్టి చికిత్స కూడా ప్రమాదకరమే. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా.. ఇంట్రా వాస్కులర్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ టెక్నిక్‌ను వినియోగించాం. భారత్‌లో గత నెలలోనే ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా విదేశాల నుంచి వైద్యులను పిలిపించకుండానే, మూసుకుపోయిన మూడు నాళాలలో రక్త ప్రసరణ జరిగేలా చేశాం."
- పవన్ సార్ఢా, డాక్టర్
హృద్రోగులను కాపాడుతాం..
ఇంట్రా వాస్కులర్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ టెక్నాలజీని ఈ ఏడాది జనవరి 11న భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా మాథరాదాస్ మాథూర్ ప్రభుత్వాసుపత్రిలో ఈ టెక్నాలజీని ఉపయోగించారు వైద్యులు. ఈ ప్రక్రియలో డాక్టర్ పవన్ సార్ఢాకు.. డాక్టర్ లలిత్, డాక్టర్ అన్షుల్, స్టాఫ్ ఓంరామ్, సరోజ్, రణవీర్, ప్రీతి సహకరించారు. ఈ విజయంతో హృద్రోగులకు మరింత సమర్థమంతంగా చికిత్స చేయగలమని వైద్యులు తెలిపారు.