మధ్యప్రదేశ్ భిండ్‌లో ఓ సాధారణ ప్రైవేట్ ఉద్యోగి రవి గుప్తాకు రూ.349 కోట్లు ఆదాయ పన్ను చెల్లించాల్సిందిగా నోటీసులు రావడం కలకలం రేపుతోంది.
భిండ్ మిహోనాలో నివసిస్తున్న రవి గుప్తా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ప్రస్తుతం 38 వేల నుంచి 40 వేల రూపాయలు వేతనం పొందుతున్నాడు. కానీ... 2011-12లో రవి సంపాదన 7వేలు రూపాయలు కూడా లేదు. కానీ, ఆ సమయంలో తన పేరుతో ఉన్న ఓ నకిలీ ఖాతాలో 132 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. అందుకే.. ఆదాయపన్ను శాఖ రూ.350 కోట్లు చెల్లించాల్సింగా రవికి నోటీసులు జారీ చేసింది.
"2019 మార్చ్ 30న నాకో మెయిల్ వచ్చింది. అందులో నేను ఆదాయ పన్ను కట్టాలని రాసి ఉంది. దానికి నేను ఎలాంటి జవాబు ఇవ్వలేదు. కొన్ని రోజుల తరువాత మళ్లీ అలాంటి మెయిల్ వచ్చింది. గ్వాలియర్‌లోని ఆదాయ పన్ను విభాగంలో విచారిస్తే.. అప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. ముంబయిలోని యాక్సిస్ బ్యాంక్ మలాడ్ బ్రాంచ్‌లో నా పేరుతో ఓ ఖాతా తెరిచారు. అందులో మొత్తం నాలుగున్నర కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. దానికి సంబంధించి ఆదాయపన్ను అధికారులు నన్ను వివరాలు అడిగారు. ఇది నా ఖాతా కాదని నేను వారికి చెప్పాను. "
-రవి గుప్తా
నాది కాదంటే వినరే..
నోటీసులు వచ్చాక అకౌంట్ నంబర్ తీసుకుని స్థానిక యాక్సిస్ బ్యాంక్‌లో విచారించాడు రవి. అతడి పాన్ కార్డ్ నంబరు, ఫొటో జత చేసి యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా తెరిచారని అర్థం చేసుకున్నాడు. ఖాతాలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు.
అయితే ఆ లావాదేవీలతో తనకేం సంబంధం లేదని ఎన్ని సార్లు చెప్పినా.. ఆదాయ పన్ను విభాగం వినకుండా నోటీసులు పంపుతూనే ఉంది. ఇదే విషయంలో ఐటీ, ఈడీ అధికారులకు లేఖ రాశాడు రవి. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదని వాపోతున్నాడు.
ఫిర్యాదు చేసినా...
నకిలీ ఖాతా కారణంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లాడు రవి. కానీ, ఈ కేసు మా స్టేషన్ పరిధిలోకి రాదని నాలుగు స్టేషన్ల పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని తెలిపాడు రవి. చేసేదేమీ లేక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పోలీసుల యాప్‌లో ఆన్లైన్ కేసు నమోదు చేశాడు. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు స్వీకరించినట్లు మెసేజ్ వచ్చిందని చెబుతున్నాడు రవి.
భారత ప్రభుత్వం, సీబీఐ తలచుకుంటే తనకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉందన్నాడు రవి.
"భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను. సీబీఐ ద్వారా ఈ కేసును దర్యాప్తు చేయించాలి. ఆ రూ.132 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమై పోయాయి? ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది? నా శాశ్వత అడ్రెస్ ప్రూఫ్ లేదు. తల్లి పేరు కూడా రాసి లేదు. నామినీ వివరాలు లేవు. మరి యాక్సిస్ బ్యాంక్‌లో నా పేరుపై ఖాతా ఎలా తెరిచారు? ఈ వివరాలన్నీ కనిపెట్టాలి."
-రవి గుప్తా
ఇదీ చదవండి:ఆమె 'వాలు జడ'కు చిక్కిన గిన్నిస్ రికార్డు