కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినాన.. మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకరజ్యోతిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు తన్మయంతో పునీతులయ్యారు. తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. మకర జ్యోతి దర్శనం ఇస్తున్న వేళ... శబరిమల సన్నిధానం స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిపోయింది.
స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకొచ్చిన ప్రత్యేక ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంబ, నీలికల్, పులిమేడ్ ప్రాంతాల్లో జ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్‌కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. టీటీబీ, అటవీ శాఖల సహకారంతో... పొన్నంబలమేడు వద్ద గిరిజనుల సంస్కృతిని కొనసాగిస్తూ, కేరళ ప్రభుత్వం జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేసింది.