మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లేనని భాజపా వర్గాలు వెల్లడించాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైందని కమలం పార్టీ నేత ఒకరు తెలిపారు. ముఖ్యమంత్రి పీఠంపై తాము వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా నుంచి తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని సేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.
రెండురోజుల్లో ప్రభుత్వం!
ప్రభుత్వ ఏర్పాటుపై రెండురోజుల్లో భాజపా-సేన సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని భాజపా నేత చెప్పారు. నవంబరు 9 లోపే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి.. శివసేనతో సంప్రదింపులు పూర్తయినట్లేనని పేర్కొన్నారు. అయితే ఏ హామీతో శివసేనను బుజ్జగించారనే విషయంపై మాత్రం భాజపా నేత స్పష్టత ఇవ్వలేదు.
రేపు గవర్నర్ను కలవనున్న భాజపా
ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని రేపు కలవనుంది భాజపా ప్రతినిధుల బృందం. మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వీరికి నేతృత్వం వహిస్తారు. సీఎం ఫఢణవీస్ ఆమోదం తెలిపిన సందేశాన్ని గవర్నర్కు చేరవేయనున్నట్లు చెప్పారు భాజపా నేత సుధీర్ ముంగంటివార్. గవర్నర్తో సమావేశం అనంతరం.. వివరాలు చెబుతామన్నారు.
సేనకు మద్దతుపై సంయుక్త నిర్ణయం
శివసేన ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే వారికి మద్దతిచ్చే అంశమై ఎన్సీపీతో కలిసే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తెలిపారు. అయితే ఎన్సీపీ ప్రతిపక్షంలోనే ఉంటుందని భాజపా-శివసేన కూటమి ప్రభుత్వానికే ప్రజలు మద్దతు తెలిపారని శరద్ పవార్ ఇప్పటికే తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి: ప్రతిపక్ష పాత్రకే ఎన్సీపీ పరిమితం- ఊహాగానాలకు పవార్ తెర