లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే భారత 28వ సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం 13 లక్షల సైన్యం ఉన్న భారత ఆర్మీకి నరవాణే నేడు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన భారత సైన్యం తూర్పు విభాగానికి అధిపతిగా వ్యవహరించారు.
సీనియారిటీ ప్రకారం నరవాణేను సైన్యాధ్యక్ష పదవికి ఎంపిక చేసింది ప్రభుత్వం. ప్రస్తుత సైన్యాధిపతి బిపిన్ రావత్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు రావత్. పదవీ విరమణ అనంతరం రక్షణ దళాల ప్రధాన అధికారిగా రావత్ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.
నరవాణే నేపథ్యం
‘1980లో సిక్కు లైట్ ఇన్ఫ్ంట్రీలో సైన్యంలో చేరిన నరవాణే ఆపరేషన్ పవన్ సమయంలో శ్రీలంకకు పంపిన శాంతి దళంలో కీలకంగా వ్యవహరించారు. జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన అనేక ఉగ్రవాద నిరోధక చర్యల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కశ్మీర్‌లో ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం.. సేనా మెడల్, అసోం రైఫిల్స్‌లో కీలకంగా వ్యవహరించినందుకుగానూ విశిష్ఠ సేవా మెడల్‌తో సత్కరించింది. మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయంలో భారత రక్షణ దళ ప్రతినిధిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
ఇదీ చూడండి: ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకెళ్లినా.. బతికిపోయాడు!