పార్కింగ్ విషయంలో నవంబర్ 2న దిల్లీ పోలీసులు, న్యాయవాదులకు మధ్య తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. వరుసగా మూడో రోజూ విధులు బహిష్కరించిన న్యాయవాదులు.. అన్ని జిల్లా కోర్టుల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. కొన్ని కోర్టుల్లో కక్షిదారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
పటియాలా హౌస్, సాకేత్ జిల్లా కోర్టుల ప్రధాన ద్వారాలను మూసివేశారు న్యాయవాదులు. భద్రతా కారణాల దృష్ట్యా కక్షిదారుల్ని న్యాయస్థాన పరిసర ప్రాంతాల్లో ఉండేందుకు నిరాకరించారు.
''లోపల పోలీసు అధికారులెవరూ లేరు. కక్షిదారులను ఎవరు తనిఖీ చేస్తారు. అందులో నేరస్థులూ ఉండొచ్చు.
మేం మొత్తం 10 వేల మంది సభ్యులం ఉన్నాం. గాయపడిన లాయర్ల సంక్షేమం, మా భద్రతపై ఏ ఒక్కరూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ''- ధీర్ సింగ్, దిల్లీ జిల్లా కోర్టు న్యాయవాదుల సమాఖ్య సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి
ఉద్రిక్తంగా నిరసనలు...
రోహిణీ జిల్లా కోర్టు ఎదుట నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఓ న్యాయవాది ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటానని బెదిరించగా.. మరొకరు భవనం పైకి ఎక్కారు. ఫలితంగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
ఇదీ వివాదం...
నవంబర్ 2న తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో దిల్లీ పోలీసులు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భద్రతా సిబ్బంది, మరికొందరు లాయర్లకు గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.
దీనిపై విచారం వ్యక్తం చేసిన దిల్లీ న్యాయవాదులు.. ఆందోళనలకు పిలుపునిచ్చారు. నవంబర్ 4 నుంచి నగరంలోని అన్ని జిల్లా కోర్టుల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. తమపై కాల్పులు జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మంగళవారం ప్రధాన కార్యాలయం ఎదుట దిల్లీ పోలీసులు నిరసనలు చేపట్టారు.
పోలీసులే ఆ వ్యాఖ్యలు చేశారు...
ఈ ఘటనపై భారత న్యాయవాదుల సమాఖ్య(బీసీఐ) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా స్పందించారు. పోలీసులు, న్యాయవాదుల వివాదంలో హింసాత్మక సంఘటనలను ఉపేక్షించబోమన్నారు. మంగళవారం ధర్నా సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులపై పోలీసులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఘటనను బీసీఐ గమనించిందని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.