ప్రేమకు వయసుతో పనిలేదని మరోసారి రుజువు చేసింది కేరళకు చెందిన ఓ వృద్ధ జంట. ఆరుపదుల వయసు నిండిన తర్వాత ఒక్కటై సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు త్రిస్సూర్ జిల్లాకు చెందిన కొచ్చానియన్ మీనన్ (67), లక్ష్మీ అమ్మల్ (66). ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు ఎట్టకేలకు పరిణయమాడారు. వృద్ధాశ్రమంలో జరిగిన వీరి వివాహానికి కేరళ వ్యయసాయ మంత్రి సహా అతిరథ మహారథులు తరలివచ్చారు. వృద్ధ జంటను ఆశీర్వదించారు.
నవ వధూవరులు
వివాహం కోసం ముస్తాబైన వధూవరులను చూసి అతిథులకు ముచ్చటేసింది. శుక్రవారం జరిగిన మెహిందీ వేడుకలో అందంగా తయారయ్యారు లక్షీ. ఎరుపు చీరలో తళుక్కున మెరిశారు. పెళ్లికొడుకుగా ముస్తాబయ్యేందుకు గుబురు గడ్డాన్ని తీసేసి యువకుడిలా తయారయ్యారు కొచ్చానియన్.
అతిథుల సమక్షంలో..
వృద్ధ దంపతుల వివాహాన్ని చూసేందుకు అనేక మంది అతిథులు విచ్చేశారు. కేరళ వ్యవసాయ మంత్రి వీ ఎస్ సునీల్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. కొచ్చానియన్, లక్షీల వివాహ వేడుక ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు సునీల్.
అలా మొదలైంది..
లక్ష్మీ అమ్మల్ భర్త క్రిష్ణ అయ్యర్ కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. ఆయనకు సహాయకుడిగా ఉండేవారు కొచ్చానియన్. అయ్యర్ మృతి తర్వాత లక్షీకి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆమెకు అవసరమైనప్పుడు సాయం చేసేవారు. కొద్ది కాలం తర్వాత లక్షీని రామవర్మపురంలోని వృద్ధాశ్రమంలో చేర్పించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కొచ్చానియన్. చాలా ఏళ్ల వరకు తిరిగి రాలేదు. అయితే కొన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరూ వృద్ధాశ్రమంలోనే కలుసుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒక్కటయ్యారు.