ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు వివిధ తరగతులకు సంబంధించి వార్షిక పరీక్షల షెడ్యూళ్లను నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు సగం సిలబస్ కూడా పూర్తికాకపోవటంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారు.
సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు మంచి మార్కులు సాధించలేరని వాపోతున్నారు. సిలబస్‌ను తగ్గించాలని కోరుతున్నారు.
"ఆగస్టు 5 నుంచి ఇంటికి పరిమితమయ్యాము. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున తరగతులు ఏమీ జరగలేదు. ఈ పరిస్థితుల్లో చదవటం చాలా కష్టం. పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి? లోయలో ఆంక్షలు ఉన్నందున ప్రైవేట్ ట్యూషన్స్ జరగలేదు."
-నైలా, ప్రైవేట్ కళాశాల విద్యార్థి, శ్రీనగర్
పాఠశాలకు వెళ్లలేదు. ప్రైవేటు ట్యూషన్స్‌కు పంపటానికి తల్లిదండ్రులు సాహసించలేదు. పూర్తి సిలబల్ జరగలేదు. ఏ విధంగా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలి?
- ముసైబ్, 10వ తరగతి విద్యార్థి, శ్రీనగర్
విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఉపాధ్యాయులు సిలబస్‌ను పూర్తి చేయలేదు. రెండో సెమిస్టర్ తరగతులు జరగలేదు. ఈ పరిస్థితుల్లో అభ్యాసం కోసం ప్రైవేట్ ట్యూషన్ పంపించలేము. పరీక్షలను ఎలా ఎదుర్కొంటారు? ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తీర్ణత మార్కులు సాధించటం వల్ల ప్రయోజనం లేదు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఇలాంటి ఆలోచనలతో వారు ఒత్తిడికి లోనవుతున్నారు.
- ఓ విద్యార్థి తండ్రి.
పెన్ డ్రైవ్ పాఠాలు...
తరగతులు జరగపోయినా విద్యార్థులకు ఎంతోకొంత నేర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి కొన్ని పాఠశాలలు. పెన్‌డ్రైవ్‌లలో అసైన్మెంట్లు నిక్షిప్తం చేసి, వాటిని విద్యార్థులకు ఇస్తున్నాయి. కొన్ని పాఠశాలలు దిగువ తరగతి విద్యార్థులకు ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
కుదరదంతే...
షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహిస్తామని, సిలబస్ తగ్గించటం కుదరదని రాష్ట్ర విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'