కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే 15 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఉదయం నుంచే తమఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఈ ఎన్నికల్లో 165 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 4,185 పోలింగ్ కేంద్రాల్లో 37, 77, 970 మంది ఓటర్లు ఉన్నారు.
భద్రత కట్టుదిట్టం
42,509 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 19,299మంది ప్రత్యక్షంగా ఓటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 11,241మంది రాష్ట్ర, 2511మంది కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. 884 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని చెప్పారు ఎన్నికల అధికారులు. 414 ప్రాంతాల్లో కేవలం కేంద్ర బలగాలతోనే పర్యవేక్షణ కొనసాగుతోంది.
ప్రధానంగా భాజపా, జేడీఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ జరుగుతోందని సమాచారం. రాజకీయ సంక్షోభం తలెత్తే వరకు 12మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన నేతలు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.
ఇదీ చూడండి: సూడాన్‌లో భారతీయుల మృతి పట్ల మోదీ విచారం