కర్ణాటకలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఖాళీ అయిన 15 శాసనసభ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బరిలో నిలిచిన 165 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు 37,77,970 మంది ఓటర్లు. ఎన్నికల కోసం 4,185 పోలింగ్ కేంద్రాలను.. 42,509 మంది సిబ్బందిని నియమించారు అధికారులు. ఉదయం 7గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
తేలనున్న భాజపా సర్కారు భవితవ్యం..
ఈ ఉపఎన్నికలు యడియూరప్ప సర్కారుకు కీలకం కానున్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే భాజపా కనీసం ఆరు సీట్లను గెలుచుకోవాల్సిన నేపథ్యంలో కమలదళం ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అనర్హత వేటు పడి తిరిగి పోటీచేస్తున్న వారిని తిరస్కరించాలని కాంగ్రెస్, జేడీఎస్ కోరుతున్నాయి.
అనర్హత వేటుకు గురై భాజపాలో చేరిన 16 మంది రెబల్ ఎమ్మెల్యేలలో 13మందిని ఆ పార్టీ ఉప ఎన్నికల బరిలో నిలుపుతోంది. భాజపా, కాంగ్రెస్ మొత్తం 15 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. జేడీఎస్ 12 స్థానాల్లో బరిలో నిలిచింది.
ఇదీ చూడండి: 'నిర్బల'పై సీతారామన్‌కు అధీర్ రంజన్ క్షమాపణలు