సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రాజకీయాల్లో కలసి పనిచేయడంపై మరింత స్పష్టత ఇచ్చారు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్. తమిళ ప్రజల సంక్షేమం కోసం అవసరమని భావిస్తేనే ఈ రాజకీయ మైత్రి ఉంటుందని వ్యాఖ్యానించారు.
"నేను, మిత్రుడు రజనీకాంత్ ఒకే అభిప్రాయంతో ఉన్నాం. తమిళనాడు కోసం అవసరమైతే కలసి పనిచేసేందుకు మేం సిద్ధం. కేవలం రాజకీయాల కోసమే ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు. తమిళనాడు అభివృద్ధే మా లక్ష్యం. ఆయన చెప్పింది జాగ్రత్తగా పరిశీలిస్తే అవసరమైతే కలిసి పనిచేస్తామన్నారు. అవును.. తమిళనాడు కోసం అవసరమైతే కలసి పనిచేస్తాం."
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యమ్ అధినేత
తమ స్నేహం కంటే తమిళనాడు సంక్షేమమే ముఖ్యమని ఉద్ఘాటించారు లోకనాయకుడు. అయితే ఇద్దరు అగ్రనటుల మధ్య రాజకీయ పొత్తు ఎప్పటికి కుదరొచ్చన్న అంశంపై కమల్ స్పష్టత ఇవ్వలేదు.
రజనీ ఎంఎన్ఎమ్ పార్టీలో చేరతారా అని ఓ పాత్రికేయుడు అడగ్గా కమల్ అసహనం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం తగదని హితవు పలికారు.
కొత్త ప్రయాణం...
కమల్‌హాసన్ గతేడాదే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించారు. 2021లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రజనీకాంత్ నూతన రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు.
తమిళనాడు సంక్షేమం కోసం రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తానని మంగళవారం కమల్ అనగా... కాసేపటికే సానుకూలంగా స్పందించారు సూపర్‌స్టార్.
ఇదీ చూడండి: రాజకీయ 'మైత్రి'కి రజనీ-కమల్ సిద్ధం!