రజనీకాంత్, కమల్‌హాసన్... భారత సినీ రంగ దిగ్గజాలు. ఒకరు సూపర్ స్టార్, మరొకరు లోకనాయకుడు. తెరపై ఎన్నోసార్లు కలిసి నటించి అభిమానులను మెప్పించారు. ఇప్పుడు వీరు మరోసారి కలిసి పనిచేయడానికి సన్నద్ధమవుతున్నారా? రీల్ లైఫ్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వీరు.. రియల్ లైఫ్‌లో తమిళనాడు అభివృద్ధి కోసం ఒకటవ్వనున్నారా? వీరి వ్యాఖ్యలతో ఈ ప్రశ్నలకు సానుకూల సమాధానాలు దొరికినట్టే కనిపిస్తోంది.
కమల్ మాట....
కమల్, రజనీ.. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో ఎంతో చురుకుగా పనిచేస్తున్నారు. మక్కల్ నీథి మయం పార్టీని స్థాపించారు కమల్. 2021 రాష్ట్ర ఎన్నికల్లోగా పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్ ఇప్పటికే స్పష్టం చేశారు.
అగ్ర నటుల రాజకీయ మైత్రిపై సంకేతాలు తొలుత కమల్ నుంచే వచ్చాయి. తమిళనాడు అభివృద్ధి కోసం రజనీతో కలిసి పనిచేస్తానని చెప్పారు కమల్. అప్పటి నుంచి రజనీ-కమల్ రాజకీయ పొత్తుపై జోరుగా ఉహాగానాలు పెరిగిపోయాయి. అయితే రాజకీయంగా అది వీలవుతుందో లేదో చెప్పలేమని కమల్ అన్నారు.
రజనీకాంత్ మాట...
ఆ ఊహాగానాలను రజనీ మరింత పెంచారు. మంగళవారం గోవాకు పయనమైన సూపర్‌స్టార్.. చెన్నై విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రజల అభివృద్ధి కోసం కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
"ప్రజల అభివృద్ధి కోసం నేను, కమల్ కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తే.. కచ్చితంగా చేతులు కలుపుతాం."
--- రజనీకాంత్.
స్నేహ బంధం...
రాజకీయాల్లో ఏదైనా సాధ్యపడుతుందని.. ఏదీ ఏమైనా కమల్‌తో ఉన్న 43ఏళ్ల స్నేహం బలహీనపడదని రజనీకాంత్ స్పష్టం చేశారు.
1975లో విడుదలైన అపూర్వ రాగంగళ్‌తో వెండితెరకు పరిచయమయ్యారు రజనీ. ఆ సినిమాలో కథానాయకుడు కమల్ హాసన్.
ఇదీ చూడండి:దిల్లీ వాయు కాలుష్యంపై నేడు పార్లమెంటరీ కమిటీ భేటీ