దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన.. ఛలో పార్లమెంట్ మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వర్సిటీ ప్రాంగణం నుంచి విద్యార్థులు 500 మీటర్లు వెళ్లగానే మార్చ్‌ను అడ్డగించారు. వెంటనే విద్యార్థులు నినాదాలతో హోరెత్తారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు పోలీసులు.
తొలుత అనుమతి ఆ తర్వాత..
హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో.. విద్యార్థులు పార్లమెంట్ వరకూ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ముందుజాగ్రత్తగా జేఎన్‌యూ ఎదుట భారీగా బలగాలను మోహరించారు అధికారులు. అయితే ఆ తర్వాత బారికేడ్లను తొలగించి.. మార్చ్‌కు అనుమతించారు. విద్యార్థులు 500 మీటర్లు వెళ్లగానే అడ్డుకున్నారు.
పోలీసులపై విద్యార్థులు ఆగ్రహించారు. త్రిసభ్య కమిటీతో తమను మభ్యపెట్టలేరంటూ కేంద్రంపైనా అసమ్మతి వ్యక్తం చేశారు.
"జేఎన్‌యూ విద్యార్థులు పార్లమెంట్ వరకూ శాంతియుతంగా చేస్తున్న మార్చ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. త్రిసభ్య కమిటీతో కేంద్రం విద్యార్థులను మభ్యపెడుతోంది. చర్చలు జరిగేంత వరకు పెంచిన ఫీజులు తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు. ఫీజులు యధాతథంగా చేయాలన్నదే మా డిమాండ్."
-సాయి బాలాజీ, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు
"త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మా విద్యార్థి సంఘానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కొత్తగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ మా సమస్యలు పరిష్కరించేలా.. విద్యార్థులు, వర్సిటీ యంత్రాంగంతో చర్చలు జరపాలి."
-అక్షత్, విద్యార్థి
ఇదీ చూడండి : జేఎన్‌యూ విద్యార్థుల 'ఛలో పార్లమెంట్' ఉద్రిక్తం