ఝార్ఖండ్ శాసనసభకు ఐదు దశల్లో జరిగిన పోలింగ్ డిసెంబర్ 20తో ముగిసింది. ఈ ఐదు దశల్లో 81 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మొత్తంగా 1,216 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో దిగారు. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన ఓటేసిన ఆ రాష్ట్ర ప్రజలు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఝార్ఖండ్ అంతటా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు.
సర్వే సంస్థ | భాజపా | కాంగ్రెస్-జేఎంఎం కూటమి | ఏజేఎస్‌యూ | జేవీఎం | ఇతరులు |
ఇండియా టుడే- యాక్సిస్ మైఇండియా | 22-32 | 38-50 | 3-5 | - | 6-11 |
ఐఏఎన్ఎస్-సీ ఓటర్-ఏబీపీ | 32 | 35 | 5 | 9 | |
టైమ్స్ నౌ సర్వే | 28 | 44 | 3 | 6 | |
కశిశ్ న్యూస్ | 25-30 | 37-49 | 2-4 | 2-4 | |
ఆజ్‌తక్ | 22-32 | 38-50 | 2-4 | 5 |
ప్రస్తుతం రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు అసెంబ్లీ ఫలితాల్లో ఓటమిని చూసే అవకాశం ఉందని తేలుస్తున్నాయి సర్వే సంస్థలు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సహా పలువురు ప్రముఖుల భవితవ్యం ఫలితాల అనంతరం పూర్తిగా మారే పరిస్థితి కనిపిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
రఘుబర్ దాస్‌కు ఓటమి భయం!
జంషెడ్‌పుర్ తూర్పు నుంచి 1995లో తొలిసారిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అక్కడి నుంచి వరుసగా ఆరుసార్లు విజయకేతనం ఎగురవేశారు. అయితే తన కేబినెట్లో పౌర సరఫరా శాఖమంత్రిగా పనిచేసిన సరయూ రాయ్.. పార్టీని వీడి రఘుబర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు అధిష్ఠానం నిరాకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాయ్. గత ఐదేళ్లుగా ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తూ ప్రతిపక్షానికి కత్తి అందించిన రాయ్ సీఎంపై పోటీ చేసిన నేపథ్యంలో రఘుబర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్-ఆర్జేడీ, జేఎంఎం కూటమి నుంచి పోటీ చేసిన గౌరవ్ వల్లభ్‌పంత్ సైతం రఘుబర్కు గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ భాజపా నేత గెలుపు నల్లేరుపై నడక ఏమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: 'యువత భవితను మోదీ-షా నాశనం చేశారు'