ఝార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని రాంచీ మోరాబది మైదానంలో జరిగిన వేడుకలో రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరీ, డి. రాజా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు.
ఘన విజయంతో..
81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్-16, ఆర్జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ వికాస్ మోర్చాకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు, ఒక సీపీఎం సభ్యుడు జేఎంఎం కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ 25 స్థానాలతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది.
హేమంత్ సోరెన్ అను నేను.. రెండోసారి
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం హేమంత్ సోరెన్‌కు ఇది రెండోసారి. గతంలో 2013లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు సోరెన్. 1 సంవత్సరం 5 నెలల 15 రోజులు తొలిసారి పదవిలో కొనసాగారు.
ఇదీ చూడండి: ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్!