కొత్తగా పెళ్లి అయిన జంట మధ్య హృతిక్ రోషన్ కలహాలు సృష్టించాడా? హృతిక్ వల్లే ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడా? అయితే.. తాను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఇంతకీ ఆ ఇద్దరి చావుకు కారణం హీరో అభిమానమేనా? అమెరికా క్వీన్స్ నగరంలో జరిగిన ఈ విచిత్ర ఘటన ఇలాంటి ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. డోన్ డొజోయ్- దినేశ్వర్ బుధిదత్ దంపతుల మధ్య ఈ దుర్ఘటన ఎలా జరిగిందో చూద్దాం..
అభిమానిస్తే అసూయ
27 ఏళ్ల డోన్ డొజోయ్కి 33 ఏళ్ల దినేశ్వర్ బుధిదత్తో జులైలో వివాహమైంది. డొజోయ్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు వీరాభిమాని. హృతిక్ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా చూసేది. అయితే.. తన భార్య ఓ సినీ హీరోను ఇంతలా ఇష్టపడుతుందేంటని బుధిదత్ ఎప్పుడూ అసూయ పడుతుండేవాడు.
హృతిక్ కనిపిస్తేనే మంట
ఇంట్లో హృతిక్ పాటలు పెట్టినా.. సినిమా చూసినా.. వెంటనే ఆపేయమని అరిచేవాడు బుధిదత్. మొదట్లో భర్త అన్నాక ఆ మాత్రం అసూయ పడతాడులే అని ఊరుకుంది డొజోయ్. కానీ ఆగస్టులో ఈ విషయంపైనే తన మీద చేయిచేసుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి నుంచి రక్షణ కావాలని కోర్టును కోరింది.
చంపి.. చెల్లికి మెసేజ్
ఇక బుధిదత్కు అసూయ తీవ్రమైంది. తన భార్యపై ఉన్న ప్రేమ కాస్తా పగగా మారింది. ఉద్రేకంలో ఉన్మాదిగా మారి.. భార్యను కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. 'మీ అక్కను చంపేశాను. ఇంటి తాళం చెవి పూల కుండీ కింద ఉంటుంది' అని డొజోయ్ సోదరికి ఫోన్లో సందేశం పంపాడు. ఆపై తానూ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
"డొజోయ్ చాలా అందంగా ఉండడమే కాదు తెలివైన అమ్మాయి కూడా. అందుకే బుధిదత్ ఎప్పుడూ ఆమెను కొడుతూ, భయపెడుతూ, ఆమెకు ఆంక్షలు పెట్టినా.. ఏనాడు అతన్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అనుమానం, అసూయలతో.. చివరికి కట్టుకున్న భార్య ప్రాణాలు తీశాడు. ఇలా చేసేందుకు తనకు ఏమాత్రం హక్కు లేదు "
-సిల్విన్, డొజోయ్ బంధువు
ఇదీ చదవండి:ఇవి తెలంగాణ వాయిద్య పరికరాలు