కర్ణాటకలో 15 స్థానాలకు డిసెంబర్ 5న ఉపఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిపై తిరుగుబాటు చేసి, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల స్థానంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పక్షానికి మెజారిటీకి ఐదుగురు శాసనసభ్యులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉపఎన్నికల అనంతరం అధికార భాజపా మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌తో కలిసే అంశాన్ని కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇదే అంశమై జేడీఎస్ నేతలను ప్రశ్నించగా మిశ్రమ సమాధానమిచ్చారు.
కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూటమి 14 నెలలపాటు కర్ణాటకలో ప్రభుత్వంలో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసిన ఇరుపార్టీలు జులైలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన అనంతరం చెరో దారి చూసుకున్నాయి. అయితే తాజా ఉపఎన్నికల్లో తామే విజయం సాధించనున్నట్లు అధికార భాజపా సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఆశల పల్లకీలో కాంగ్రెస్..
మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కన్నడ కాంగ్రెస్ వర్గాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా కనిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు కలిసి పోరాడతాయని అభిప్రాయపడ్డారు హస్తం పార్టీ సీనియర్ నేత వీరప్పమొయిలీ.
"మరో ఎన్నికలను ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కోలేని దృష్ట్యా సాధారణ ఎన్నికల వరకు ఎవరో ఒకరు ప్రభుత్వంలో ఉండాలి. ఈ నేపథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం తప్పనిసరి. మా లక్ష్యం భాజపా మాత్రమే. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అన్న ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి మేం కూటమిగా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉంది."
-వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ నేత
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైన విధంగానే కర్ణాటకలోనూ ఏర్పడేందుకు అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జీ కేసీ వేణుగోపాల్. అయితే పొత్తు విషయమై జేడీఎస్ నుంచి మిశ్రమ స్పందన వస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ వెల్లడించారు.
'సమాన దూరం'
కాంగ్రెస్, భాజపాలకు సమాన దూరం పాటిస్తూ తమ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జేడీఎస్ సుప్రిమో హెచ్డీ దేవెగౌడ సోమవారం వెల్లడించారు. తనకు ఇద్దరితోనూ పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తికి మించి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అయితే మాజీ సీఎం కుమారస్వామి ఇటీవల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడవచ్చని చెప్పడం వారి పార్టీ హస్తం వైపు మొగ్గు చూపుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుబ్బళ్లిలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో కుమారస్వామి సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
గెలుపుపై యడ్డీ ధీమా
ఉపఎన్నికలు జరుగుతున్న 15 స్థానాల్లో తామే జెండా ఎగరేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి యడియూరప్ప. మూడున్నరేళ్లపాటు రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు. ఉపఎన్నికల ఫలితాలు వెలువడబోయే డిసెంబర్ 9న రాజకీయ మార్పులు ఉంటాయని కాంగ్రెస్ ఆశిస్తోందని, కానీ వారి అంచనా భ్రమ గానే మిగిలిపోతుందన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 150 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు యడ్డీ.
ఇదీ చూడండి: 'ప్రియాంక'తో సెల్ఫీ కోసం.. దూసుకొచ్చిన కారు..!