దిల్లీలో జామియా విశ్వవిద్యాలయంలో జరిగిన అల్లర్లకు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు విద్యార్థులు. పోలీసుల చర్యపై దిల్లీ అంతటా నిరసనలు వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం ఎముకలు కొరికే చలిలో వందలాది మంది యువత జామియా యూనివర్సిటీ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. వీరికి స్థానికులు, ఇతర యూనివర్సిటీ విద్యార్థులు మద్దతు పలికారు.
ఆదివారం యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించిన విషయంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. మైనారిటీ, విద్యార్థులు, పేదలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమాన్ని కొంత మంది సామాజిక మాధ్యమాల్లో లైవ్ పోస్ట్ చేశారు.
'దారుణంగా కొట్టారు'
ఆదివారం జరిగిన ఘటనలో.. పోలీసులు కనిపించిన ప్రతి ఒక్కరిని చితకబాదారని ఓ విద్యార్థి తెలిపాడు. లైబ్రరీలో కూర్చున్న వారినీ వదలిపెట్టలేదని చెప్పాడు. మహిళా విద్యార్థులనూ పోలీసులు కొట్టినట్లు పేర్కొన్నాడు. దాదాపు 7 నుంచి 50మంది పోలీసులు.. యూనివర్సిటీలోకి ప్రవేశించారన్నాడు. పోలీసులే తమను తీవ్రవాదులుగా పిలిచి రెచ్చగొట్టారన్నాడు.
అనుమతి లేకుండా ప్రవేశం!
జామియా యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించారని ఆరోపించారు వర్శిటీ ఉప కులపతి నజ్మా అక్తర్. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు.
పరీక్షలు బహిష్కరణ...
జామియా యూనివర్సిటీ ఘటనకు నిరసనకు మద్దతుగా పరీక్షలు బహిష్కరించారు దిల్లీ యూనివర్సిటీ(డీయూ) విద్యార్థులు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని ప్రొఫెసర్లను ఆదివారం రాత్రే విద్యార్థులు కోరినట్లు సమాచారం. అయితే పరీక్షలు చివరి దశలో ఉన్నందున వాయిదా వేయడం కుదరదని ప్రొఫెసర్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా వెనక్కి తగ్గని విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జామియా యూనివర్సిటీ నుంచి పరీక్షా కేంద్రాన్ని మరో కేంద్రానికి మార్చింది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో). అధికారిక వెబ్సైట్లో నూతన పరీక్ష కేంద్రాల వివరాలను పొందుపరిచినట్లు స్పష్టం చేసింది.
వివిధ రాష్ట్రాల్లో ఇలా...
తమిళనాడులో..
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా, జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఐఐటీ మద్రాస్ సహా తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు విద్యార్థులు. చెన్నై, మదురై, కోయంబత్తూర్ రైల్వే స్టషన్లలో నిరసనలు చేపట్టిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు.
కేరళలో..
ఆదివారం ఘటనలో పోలీసుల చర్యను ఖండిస్తూ కేరళలో రైల్‌రోకోకు కదం తొక్కింది డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం. తిరువల్ల, కొల్లంలో రైల్వే ట్రాక్‌పై నిరసనలు చేపట్టి.. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు విద్యార్థులు.
మహారాష్ట్రలో
దిల్లీ విద్యార్థులకు మద్దతుగా వందలాది మంది విద్యార్థులు ముంబయిలో ర్యాలీ నిర్వహించారు. ఔరంగాబాద్‌లో డా. బాబా సాహెహ్ అంబేడ్కర్ మరాఠ్వాడా యునివర్సిటీ వద్ద కూడా నిరసనలు చేపట్టారు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: బంగాల్లో దీదీ భారీ 'నిరసన ర్యాలీ'