పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో భాజపాపై విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భాజపా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు రిజర్వేషన్లకు వ్యతిరేకమని ధ్వజమెత్తారు.
"ఆర్ఎస్ఎస్, భాజపా సిద్ధాంతాలు రిజర్వేషన్లకు వ్యతిరేకం. వారు ఎలాగైనా రిజర్వేషన్లను భారత రాజ్యాంగం నుంచి తొలగించాలనుకుంటున్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో రిజర్వేషన్లు కనిపించవు. కోటా రద్దు కానీయబోమని నిమ్నవర్గాలతో పాటు భారత ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. మోదీ, మోహన్ భగవత్ కలలు నిజం కానివ్వం."-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
సుప్రీం తీర్పు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. పదోన్నతుల్లో రిజర్వేషన్ కోటా పొందడం ప్రాథమిక హక్కేమీ కాదని స్పష్టం చేసింది. 2012లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఉత్తరాఖండ్ హైకోర్టు గతంలో తిరస్కరించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఈ మేరకు తీర్పునిచ్చింది.