దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 50వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గవర్నర్లకు దిశా నిర్దేశం చేశారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు పెట్టుబడులతో ఉద్యోగాల సృష్టి, అంకుర సంస్థల స్థాపనకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నూతన విద్యా వ్యవస్థ..
నూతన విద్యా విధానం ద్వారా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు మెరుగుపరచటం, పెట్టుబడులు కల్పించే దిశగా గవర్నర్లు కృషి చేయాలని మోదీ అన్నారు. పరిశోధనల్లో సాంకేతికతను పెంపొందించి నూతన ఆవిష్కరణల దిశగా చర్యలు చేపట్టాన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి...
గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావిస్తూ...సాంకేతికత,అమలులోఉన్న పథకాల ద్వారా క్రీడలు, యువతను అభివృద్ధి పథంలో సాగేలా చూడాలన్నారు మోదీ. దేశంలోని 112 జిల్లాలు.. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
నీటి సంరక్షణ....
జల్ జీవన్ మిషన్ ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న నీటి సంరక్షణ, నిర్వహణ పద్ధతుల గురించి వివరించారు ప్రధాని. నీటి వినియోగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు..
వ్యవసాయం..
క్లస్టర్ విధానాన్ని ఉపయోగించి వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచాలని గవర్నర్లకు సూచించారు మోదీ. అంతర్జాతీయగా ఉత్తమ పద్ధతులను వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలన్నారు.