శస్త్రచికిత్స తర్వాత ప్రమాధ ఘంటికలు
అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఆందోళన రేకెత్తిస్తున్న అంశాన్నొకదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాధుల నియంత్రణ నివారణ కేంద్రం (సీడీసీ) సంయుక్తంగా వెలువరించిన తాజా నివేదిక ప్రస్తావించింది. శస్త్ర చికిత్స దరిమిలా ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో రకమైన రుగ్మత (ఇన్‌ఫెక్షన్) బారిన పడుతున్నారని; అమెరికా, బ్రిటన్‌లతో పోలిస్తే భారత్, ఆఫ్రికాల్లో ఆ తాకిడి అధికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇక్కడి ఎన్నో ఆస్పత్రులు అంటురోగాల వ్యాప్తి కేంద్రాలుగా భ్రష్టుపడుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణకు తగిన సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపట్టినట్లు చాటుకుంటున్న పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు అయిదు నెలల వరకు మనగలుగుతుండగా, అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న చోట్ల మొండి క్రిములు ముప్ఫై నెలలపాటు జీవిస్తున్నాయన్న లెక్కలు- పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. రోగులకు సకాలంలో మానవీయ దృష్టితో ఆరోగ్య సేవలు సజావుగా అందాలన్న నిర్దేశాలు గాలికి కొట్టుకుపోతుండగా, శస్త్రచికిత్స తరవాత అదనపు సమస్యలు దాపురించే దుస్థితి రోగులు, వారి సంబంధీకుల పాలిట పిడుగుపాటుగా పరిణమిస్తోంది!
మొన్నీమధ్య ఇండోర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కంటిశుక్లాలు తొలగించే కేటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్న కొంతమంది చూపు కోల్పోయిన ఉదంతం గగ్గోలు పుట్టించింది. అక్కడ ఆపరేషన్ జరిగిన పద్నాలుగు మందిలో పదకొండుగురు కంటిచూపునకు దూరం కావడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇన్‌ఫెక్షన్ల కారణంగా బతుకు చీకటైపోయిన అభాగ్యుల గోడు అక్కడికే పరిమితం కాలేదు.
దేశంలోనే మొట్టమొదటి శ్వాసకోశ మార్పిడిపై ఆమధ్య విస్తృత కథనాలు వెలువడ్డాయి. చండీగఢ్ పీజీఐ (స్నాతకోత్తర వైద్యవిద్యా పరిశోధన సంస్థ)లో శస్త్రచికిత్స జరిగిన రెండు వారాలకు ముప్ఫై నాలుగేళ్ల పంజాబీ మహిళ ఊపిరి ఆగిపోయింది. ప్రమాదానికి గురై ‘బ్రెయిన్ డెడ్’ అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాన్ని ఆ మహిళకు విజయవంతంగా అమర్చగలిగినా, ఆస్పత్రిలో సోకిన ఇన్‌ఫెక్షన్ ప్రాణాంతకమైంది. ఇటీవల నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలకు చెందిన 14మంది స్త్రీలు సిజేరియన్ ప్రసవం తరవాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇక్కడి మొత్తం ప్రసవాల్లో ఇటువంటి సమస్య తలెత్తింది కేవలం నాలుగు శాతం కేసులలోనే... దేశవ్యాప్తంగా ఇలా ఇన్ఫెక్షన్ సోకుతున్న రేటు 22 శాతమని వసంతరావు నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి సిబ్బంది అప్పట్లో వివరణ దయచేశారు!
పిల్లికి చెలగాటం-ఎలుకకు ప్రాణసంకటం
ఒకప్పుడు మహాత్మాగాంధీ సప్తమహా పాతకాలను ప్రస్తావించారు. అందులో మూడు- గుణశీలత లేని జ్ఞానం, మానవీయత లోపించిన శాస్త్రవిజ్ఞానం, నైతికత కరవైన వ్యాపారం. అరుదైన ఉదాహరణలు మినహా- భారతీయ వైద్యరంగానికి అవిప్పుడు సహజాభరణాలై భాసిస్తున్నాయి. వృత్తినిబద్ధతకు మారుపేరైన ఏ కొద్ది సంస్థలో తప్ప తక్కినచోట్ల అవసరం లేకపోయినా రోగనిర్ధారణ పరీక్షలు మొదలు శస్త్రచికిత్సల దాకా ఇష్టారాజ్యంగా చేసేస్తున్న పోకడలు- పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం సామెతను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి.
పిండేస్తున్న వైద్యులు
ఖరీదైన మందులు, ఇంటెన్సివ్ కేర్ సేవలు తప్పనిసరి అంటూ రోగుల నుంచి భారీగా పిండేస్తున్న వైద్యులు, ఆస్పత్రుల ఎనలేని ప్రావీణ్యం చూసి నెత్తురు పీల్చే జలగలు అవమానభారంతో కుమిలిపోవాల్సిందే. అందని ఆరోగ్యంపై ఆశ చావక ఏటా కోట్లమంది అభాగ్యులు కడు పేదరికంలోకి జారిపోవడానికి శాయశక్తులా పుణ్యం కట్టుకుంటున్నది స్వస్థ మాఫియాయే! దవాఖానాల్లో అలసత్వంతో పెనవడిన అవినీతి జబ్బు రోగుల ప్రాణాలు తోడేస్తోంది. గత్యంతరం లేదంటూ చేసిన శస్త్రచికిత్సల తరవాత నిర్లక్ష్యపూరిత ధోరణుల వల్ల సోకిన ఇన్ఫెక్షన్లూ ఉసురు తీసేస్తున్నాయి. పర్యవసానంగా అదనపు సంకటాలకు, అర్ధాంతర మరణాలకు కొన్ని ఆస్పత్రులే నెలవులవుతుండటం నిర్ఘాంతపరుస్తోంది.
అంకితభావానికి పర్యాయపదమనదగ్గ వైద్యపుంగవులు, ఏళ్ల తరబడి ఉన్నత ప్రమాణాల సాధనలో తలమునకలైన ప్రతిష్ఠాత్మక సంస్థల సేవానిరతి సాటిలేనిది. ఆ లక్షణాలను మచ్చుకైనా ఒంట పట్టించుకోనివాళ్ల మూలాన యావత్ వైద్యరంగం ప్రతిష్ఠే బీటలు వారుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 69శాతం ప్రసవాల సందర్భంగా సిజేరియన్ శస్త్రచికిత్సల ‘ఆనవాయితీ’ స్థిరపడింది. కడుపునొప్పి అంటూ ఎవరైనా మహిళలు ఆస్పత్రులకెళ్తే చాలు, వయసు నిబంధనల్ని వాస్తవిక స్థితిని పట్టించుకోకుండా పెద్దాపరేషన్లు చేసేసే వైపరీత్యం- ఏ సులభార్జన మార్గాన్నీ వదిలిపెట్టరాదన్న యావకు పరాకాష్ఠ. ఆ ఖర్చుకుతోడు- డాక్టర్లు కత్తికి కత్తెరకు పనిపెట్టాక అనివార్యంగా కమ్ముకుంటున్న ఇన్ఫెక్షన్ల ముసురు... బాధిత కుటుంబం ఇప్పట్లో కోలుకునే వీల్లేకుండా శాయశక్తులా కాచుకుంటోంది!
వైద్య పర్యాటకానికి గట్టి దెబ్బ
సంపన్న దేశాలతో పోలిస్తే ఎముక మూలుగ మార్పిడి, బైపాస్ సర్జరీ, మోకాళ్ల శస్త్రచికిత్స, కాలేయ మార్పిడి వంటి సేవల ఖరీదు తక్కువన్న లెక్కతో భారత్‌లో వికసిస్తున్న వైద్య పర్యాటకాన్ని గట్టి దెబ్బతీసే పరిణామమిది. ఆపరేషన్ తరవాత ఇతరత్రా రుగ్మతలు చుట్టుముట్టే ముప్పు ఎవరినైనా హడలెత్తించేదే. మూడేళ్ల క్రితం యాంటీ బయాటిక్స్ వినియోగానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు శస్త్రచికిత్సకు ముందు, అది నిర్వహిస్తున్నప్పుడే తప్ప ఆ తరవాత యాంటీబయాటిక్స్ వాడవద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా దేశంలో పెచ్చుమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం తీవ్ర అనర్థదాయకమని నిపుణులు మొత్తుకొంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా రూ.4,000 కోట్లకు పైగా విలువైన యాంటీబయాటిక్స్ ఔషధాలను గుటుక్కుమనిపిస్తున్నట్లు అంచనా. వాటి విచ్చలవిడి వాడకంతో తలెత్తే దుష్పరిణామాలు ఒకవంక, విపణిలో నాసి నకిలీ మందుల విజృంభణ మరోపక్క- ఏక కాలంలో జనం జేబులకు, ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.
భారత రాజ్యాంగం పౌరులందరికీ జీవించే హక్కును ప్రసాదించింది. దురదృష్టవశాత్తు, బతికించాల్సిన ఆస్పత్రుల్లోనే ఆ హక్కు కొల్లబోతోంది! గొంతు తడిపే నీరు, ఆకలి తీర్చే తిండి, ప్రాణాలు నిలబెట్టే గాలి... దేనికదే విషతుల్యమై రోగాలు కోరచాస్తున్న దేశంలో చికిత్సాలయాలే యమసదనాలైతే- బడుగు జీవులు ఏమైపోవాలి? దేశ వైద్యారోగ్య రంగం రోగులకు భరోసా ఇవ్వగల స్థితిలో లేదని లోగడ సంబంధిత శాఖామాత్యులే వాపోయిన గడ్డమీద ఇప్పటికీ ప్రాణాలకేదీ ఠికాణా? నియంత్రణ వ్యవస్థను పరిపుష్టీకరించి, ఇంటిదొంగలూ అక్రమార్కుల భరతం పడితేనే గాని నాసి ఔషధాల పీడ విరగడ కాదు. ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వాల అజెండాలో ముందువరసకు చేరి, దిద్దుబాటు చర్యలు సక్రమంగా పట్టాలకు ఎక్కితేనేగాని- విచ్చలవిడి ఔషధ వినియోగం కట్టడి మొదలు సురక్షిత చికిత్సల పర్యవేక్షణ వరకు ఏదీ సాకారం కాదు. ఏమంటారు?
ఇదీ చూడండి : ఇటలీ: వీధుల్లో ఉప్పొంగుతున్న వరదలు