మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అని నానుడి. జనసంఖ్యాపరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఇండియా 2027 నాటికే చైనాను తలదన్ని అగ్రపీఠిని చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. పంద్రాగస్టునాడు ఎర్రకోట నుంచి జాతిజనుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ- జనాభా విస్ఫోటం వర్తమానంతోపాటు భావితరాలకూ ఎన్నో సంకటాల్ని సృష్టిస్తోందంటూ, చింతల్లేని చిన్న కుటుంబాల్ని కలిగినవారు దేశ సంక్షేమానికీ దోహదపడుతున్నారని శ్లాఘించారు. రాజకీయ లాభనష్టాల్ని బేరీజు వేసుకొని తీసుకొనే నిర్ణయాలతో ఎంతో చెరుపు జరుగుతోందంటూ ఇండియా తాను ఎదుర్కొంటున్న జన విస్ఫోట సవాళ్లను దీటైన కార్యాచరణతో అధిగమించాల్సి ఉందనీ ప్రకటించారు. జన నియంత్రణ పథకాల వైఫల్యం జాతి ప్రగతికే గుదిబండగా మారుతున్న నేపథ్యంలో జనాభా స్థిరీకరణ ముసాయిదా తయారీకి తాజాగా నీతి ఆయోగ్ నడుం కట్టింది.
గణాంకాలు
2050 సంవత్సరం దాకా ప్రపంచ జనాభా వృద్ధిలో సగానికి పైగా ఇండియా, నైజీరియా, పాక్ వంటి తొమ్మిది దేశాల్లోనే నమోదు కానుందన్న ఐరాస అంచనాల్నిబట్టి, 2035 కల్లా జనస్థిరీకరణకు గట్టి వ్యూహం పట్టాలకెక్కాలని నీతి ఆయోగ్ తలపోస్తోంది. అయిదు దశాబ్దాల క్రితం అయిదుగా ఉన్న సంతాన సాఫల్య రేటు 1991 నాటికి 3.1కి, 2013 వచ్చేసరికి 2.3కు దిగివచ్చిన మాట నిజమే అయినా ఇప్పటికే 137 కోట్లకు చేరిన జనసంఖ్య ప్రణాళికాకర్తలకు పెనుసవాలుగా మారింది. ప్రస్తుత జనాభాలో 30 శాతం సంతానోత్పత్తి వయసులో ఉన్నారని, దాదాపు మూడుకోట్ల మంది వివాహితలకు కుటుంబ నియంత్రణ సాధనాలు అందుబాటులో లేవనీ నీతి ఆయోగ్ గుర్తించింది. ఇండియా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే- అవాంఛిత గర్భాల్ని నిరోధించే అవకాశాలపై దంపతులకు అవగాహన, నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులో ఉండాలి. తదనుగుణమైన సమర్థ వ్యూహాలకు సత్వరం సానపట్టాలి!
కుటుంబ నియంత్రణ
కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా గుర్తించిన దేశం ఇండియానే. ‘పరిమిత కుటుంబం’ అన్న మాటను తొలి పంచవర్ష ప్రణాళిక సైతం ప్రస్తావించింది. అయినా 72 ఏళ్ల స్వతంత్ర భారతం- స్వాతంత్య్రం సిద్ధించేనాటికి ఉన్న జనాభాకు అదనంగా వంద కోట్లమందికి పైగా జనసంఖ్యతో నేడు అలరారుతోంది. 2000 సంవత్సరంలో జాతీయ జనాభా విధానం రూపొందేనాటికి 3.2గా ఉన్న సంతాన సాఫల్య రేటు ఇప్పుడు 2.2కు దిగివచ్చిన మాట నిజమే అయినా యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా విస్ఫోటంతో గంప లాభం చిల్లి తీసినట్లవుతోంది. ఈ దురవస్థను దునుమాడాలంటే న్యాయపాలిక జోక్యం చేసుకొని ఇద్దరు పిల్లల పరిమితి నిబంధన విధించే చట్టం కోసం ప్రభుత్వాల్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలూ దాఖలయ్యాయి. ఫలానా విధంగా శాసన నిర్మాణం చెయ్యాలన్న ఆదేశాలు ఇవ్వజాలమని మొన్న సెప్టెంబరు మొదటి వారంలో దిల్లీ హైకోర్టు ఓ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో, అది సుప్రీంకోర్టుకు చేరింది.
1976లో రాజ్యాంగానికి చేసిన 42వ సవరణ- జనసంఖ్య అదుపు, కుటుంబ నియంత్రణపై చట్టం చేసే అధికారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టిందని; జన విస్ఫోట నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలంటూ జస్టిస్ వెంకటాచలయ్య సారథ్యంలోని రాజ్యాంగ సమీక్షా సంఘమూ సూచించిందన్న తాజా వ్యాజ్యంతోపాటే మరో మూడు సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్నాయి. కొత్త సహస్రాబ్దిలో సంతాన సాఫల్య రేటు 23 శాతం తగ్గినప్పటికీ బిహార్, మేఘాలయ, యూపీ, నాగాలాండ్, మణిపూర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జన విస్ఫోటం ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉందంటూ కేంద్రం జనాభా నియంత్రణ చట్టం తెచ్చే యోచన చేస్తోందని నెల రోజుల క్రితం కేంద్రమంత్రి సంజీవ్ బాల్యాన్ వెల్లడించారు. కోర్టుల నిర్దేశాలతోనో, పార్లమెంటు శాసనాలతోనో కాదు- సమస్యకు మూలకణ చికిత్స దిశగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగెయ్యాలిప్పుడు!
సామాజిక అవగాహన
దేశీయంగా అత్యధిక జనాభాగల 146 జిల్లాల్లో ‘మిషన్ పరివార్ వికాస్’ పేరిట ఘనతర కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం చేపట్టింది. ‘బిమారు’గా భ్రష్టుపట్టిన బిహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ యూపీలతోపాటు ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో కేంద్రీకృతమైన ఆ జిల్లాలు దేశ జనాభాలో 44శాతం కలిగి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన 115 జిల్లాల్లోనే అత్యధిక సంఖ్యాక కౌమారప్రాయ తల్లులు ఉండగా, 25-30 శాతం దాకా ప్రసవ సమయ మరణాలు, 50శాతం శిశు మరణాలు ఆ జిల్లాల్లోనే సంభవిస్తున్నాయి. అవగాహన కార్యక్రమాల్ని విస్తృతం చేసి, గర్భనిరోధక సాధనాల్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జన నియంత్రణ, సామాజికారోగ్య పరిరక్షణ రెండింటినీ సాధించదలచినట్లు కేంద్ర సర్కారు ఆనాడు లక్ష్య ప్రకటన చేసింది.
ఆ పథకం ఏ మేరకు ఫలవంతమైందీ తెలియదు! ఇద్దరు పిల్లల పరిమితిని అతిక్రమించినవారికి ఓటుహక్కు, ఎన్నికల్లో పోటీ, ఆస్తి, ఉచిత న్యాయసహాయం, ఉచిత ఆవాసం వంటి హక్కులన్నీ రద్దు కావాలంటున్న వ్యాజ్యాలు, చట్టం తెస్తే అందులో పొందుపరచే శిక్షలు- అంతిమంగా వికటించే ప్రమాదం ఉందని నిపుణులు మొత్తుకొంటున్నారు. తలకొరివి పెట్టే కొడుకు కోసం పరితపించే భారతీయ సమాజం అవాంఛిత ఆడపిల్లల్ని వదిలించుకోవడానికి రెండు కోట్ల 10 లక్షల గర్భస్రావాలకు ఒడిగట్టిందని 2018 ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆ పెడపోకడలు విజృంభించే ప్రమాద హెచ్చరికలు వినిపిస్తున్న తరుణంలో- ఆశా కార్యకర్తల సైన్యాన్ని, అంగన్‌వాడీ వ్యవస్థను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని బలోపేతం చేసి సామాజిక అవగాహనను పెంచడం ద్వారానే ఇండియా జనాభా స్థిరీకరణను సాధించగలిగేది!
ఇదీ చూడండి : ముస్లిం మైనారిటీలకు భారత్ రక్షణ కల్పించాలి: ఓఐసీ