హరియాణాలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమైంది. ఎన్నికల్లో సాధారణ మెజార్టీ సాధించనప్పటికీ.. జేజేపీ సహా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కమలం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. భాజపాకు ముఖ్యమంత్రి పదవి, జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
గవర్నర్‌ను కలవనున్న ఖట్టర్
జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలాతో భేటీ అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. హరియాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భాజపా, జేజేపీ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ నేడు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. అంతకు ముందు భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్షనేతను ఎన్నుకుంటారు.
మహారాష్ట్ర పీఠంపై ఉత్కంఠ
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా-శివసేన ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నా.. ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. చెరి సగం పరిపాలన చేద్దామంటూ శివసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఎన్సీపీని పొగుడుతూ.. కమలం పార్టీని విమర్శిస్తూ కొత్త సందేహాలకు ఆస్కారమిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనను ఒప్పించడం ఇప్పుడు భాజపాకు పెద్ద సవాల్‌గా మారింది.
చెరి సగం చేసుకుందాం
మహారాష్ట్రలో విజయం సాధిస్తే చెరి సగం కాలం పరిపాలన సాగించాలన్నది తమ నిర్ణయమని లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని అమిత్ షాకు చెప్పామని ఉద్దవ్ ఠాక్రే గుర్తు చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించామని.. భాజపాకు ప్రతిసారి అవకాశం ఇవ్వలేమని తమ పార్టీ కూడా ఎదిగేందుకు తాను కృషి చేయాలన్న ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రశంసల వర్షం
భారతీయ జనతా పార్టీది అధికార అహంకారమంటూ శివసేన పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో విమర్శించింది. ఈ సంపాదకీయంలో కాంగ్రెస్, ఎన్సీపీ సాధించిన ఫలితాలను ప్రశంసించింది. భాజపా చెప్పినట్లుగా మహా ఫలితాలు వెలువడలేదని కాంగ్రెస్, ఎన్సీపీలు మెరుగుపడ్డాయని.. రాజకీయాల్లో ప్రతిపక్షం లేకుండా చేయలేమని పేర్కొంది.
పొత్తుల రగడ
శివసేనతో పొత్తు కోసం కాంగ్రెస్, ఎన్సీపీ ప్రయత్నిస్తున్నాయన్న వార్తలను ఇరు పార్టీలు ఖండించాయి. శివసేనతో పొత్తు అంశాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఖండించారు. కాంగ్రెస్, ఎన్సీపీలు మిత్ర పక్షాలన్న ఆయన.. సమష్టిగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజాతీర్పును అనుసరించి ప్రతిపక్షంలోనే ఉంటామన్న పవార్..అధికారం అనే ఆలోచన తమ మనసులోకి కూడా రాదన్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్, లద్దాఖ్‌లకు లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకం