మహారాష్ట్ర రాజకీయాలను తనచుట్టూ తిప్పుకున్న అజిత్ పవార్... ఇకపై తాను ఎన్సీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని తేల్చిచెప్పారు.
"ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ లేదు. సరైన సమయంలో స్పందిస్తాను. నేను ఇంతకు ముందే చెప్పాను... ఎన్సీపీలో ఉన్నాను, ఉంటాను. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదు."- అజిత్ పవార్, ఎన్సీపీ నేత
నాకు హక్కు ఉంది..
మంగళవారం తన బాబాయ్ శరద్ పవార్‌ను కలవడంపై అజిత్ పవార్ స్పందించారు. 'మా నాయకుడ్ని కలుసుకునే హక్కు నాకు ఉంది' అని అన్నారు.
సరైన సమయంలో స్పందిస్తా...
అజిత్ పవార్‌తో పొత్తు పెట్టుకోవడం పొరపాటు కాదా అనే ప్రశ్నకు.. 'సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తా' అని మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.
3 రోజుల కలకలం...
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కలిసి సర్కార్ ఏర్పాటుచేయాలనుకున్న తరుణంలో ఒక్కసారిగా కలకలం సృష్టించారు అజిత్‌పవార్. శరద్‌పవార్‌కు తెలియకుండానే భాజపాకు మద్దతు తెలిపి.. ప్రభుత్వ ఏర్పాటులో పాలుపంచుకున్నారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో అజిత్‌ను ఎన్సీపీ శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగిస్తూ ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది. అయితే అజిత్ ఓ ఎన్సీపీ సభ్యుడిగా మాత్రం కొనసాగారు.
అంతలోనే భారీ మార్పు..
అంతలోనే 'మహా'రాజకీయం మలుపు తిరిగింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి అజిత్ తప్పుకుని.. భాజపాకు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా దేవేంద్ర ఫడణవీస్ సర్కార్ కుప్పకూలింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.
ఇదీ చూడండి: అమెరికాలో 'విమానం' కలకలం- శ్వేతసౌధం బంద్!