గుజరాత్‌లోని ఓ పాఠశాల ప్రశ్నాపత్రంలో దర్శనమిచ్చిన ఓ ప్రశ్న.. ఆ రాష్ట్ర విద్యాశాఖనే విస్తుపోయేలా చేసింది. 'గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?' అన్న ప్రశ్న.. సుఫలాంశాల వికాస్ సంకుల్ పాఠశాలలోని 9వ తరగతి ప్రశ్నాపత్రంలో కనిపించింది. మహాత్ముడి సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే ఈ విధంగా తప్పులు జరగడం ఎంతో బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
12వ తరగతి ప్రశ్నాపత్రంలో మరో తప్పిదం జరిగింది. 'మీ ప్రాంతంలో పెరుగుతున్న మద్యం విక్రయాల గురించి ఫిర్యాదు చేస్తూ జిల్లా ముఖ్య పోలీసు అధికారికి లేఖ రాయండి' అని ఉంది. నిజానికి గుజరాత్లో మద్యంపై నిషేధం ఉంది. ఈ అంశాన్ని ప్రశ్నాపత్రం తయారు చేసే వారు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.
గాంధీనగర్‌లో ఉన్న ఈ పాఠశాల స్వయం పెట్టుబడితో నడుస్తోంది. ఈ బడికి రాష్ట్ర గుర్తింపు ఉంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే సంబంధించిన వారిపై చర్యలు చేపడతామని గాంధీనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి భారత్ వధేర్ తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్ర విద్యాశాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- 75 ఏళ్ల వయసులో 'అమ్మ' అయిన 'బామ్మ'!