అప్పుడే అప్పగిస్తే..
ఎన్నికలకు ముందు హరియాణాలో భాజపాకు దాదాపుగా ఏకపక్ష పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. విపక్షం ముక్కలు చెక్కలుగా ఉంది. మరోసారి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న భరోసా ఖట్టర్‌లో ఉండేది. మొత్తం 90 సీట్లకు గాను 75కుపైగా సీట్లు సాధించాలని నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత భూపీందర్ సింగ్ హుడా రంగ ప్రవేశం చేశాక పరిస్థితి మారిపోయింది. భాజపా నేతల కాళ్ల కింద నేల క్రమంగా కదలడం మొదలైంది. ఏకపక్ష విజయం మాట అటుంచితే ఉన్న మెజార్టీని కూడా ఆ పార్టీ పోగొట్టుకోవాల్సి వచ్చింది.
రెండుసార్లు హరియాణా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ జాట్ దిగ్గజానికి తొలుత రాష్ట్ర పార్టీ బాధ్యతలను కాంగ్రెస్ అధినాయకత్వం ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా చేతిలో ఓటమిపాలయ్యాక ఒకానొక సమయంలో రాష్ట్ర రాజకీయాలకు ఆయన పూర్తిగా దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. సీఎంగా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాతో కలసి అనేక అక్రమ భూ లావాదేవీలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. వాద్రా-డీఎల్‌ఎఫ్ కేసు ఐదేళ్లుగా ఆయనను వెంటాడుతోంది.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, పార్టీ అధ్యక్ష పదవినుంచి రాహుల్ గాంధీ వైదొలగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఒక దశలో ఆయన భాజపాలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన పలుమార్లు కలిశారు. ఈ వార్తలతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. సోనియా జోక్యంతో హుడా హరియాణా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఇన్‌ఛార్జి బాధ్యతలను చేపట్టారు. గతంలో ఆయన సోనియాకు అండగా నిలిచారు. 1993లో నాటి ప్రధాని పి.వి.నరసింహారావును ధిక్కరించి ఆమెకు మద్దతు పలికారు. 1996లో పార్టీ ఓటమి తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు సోనియా చేపట్టాలని హుడా నేతృత్వంలోని 24మంది ఎంపీలు గట్టిగా డిమాండ్ చేశారు.
"దాదాపు 15 రోజుల పాటు పార్టీ తరఫున ప్రచారం చేశా. పార్టీ ప్రచార బాధ్యతలను మొదటే నాకు అప్పగించి ఉంటే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విస్పష్ట మెజార్టీ వచ్చి ఉండేది. హామీలు నిలబెట్టుకోని భాజపాకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఇది. మెజార్టీకి ఆమడ దూరంలో ఉండిపోయిన ఆ పార్టీకి అధికారంలో కొనసాగే హక్కులేదు. జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ, ఇతరులు, స్వతంత్రులు కాంగ్రెస్‌తో చేతులు కలిపి.. భాజపాను అధికారానికి దూరంగా ఉంచాలి."
- భూపీందర్ సింగ్ హుడా
ముందుండి పోరాటం
చివర్లో రంగప్రవేశం చేసినప్పటికీ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకురాలు కుమారి సెల్జాతో కలసి కాంగ్రెస్ పోరాటాన్ని హుడా ముందుండి నడిపించారు. ఖట్టర్ ప్రభుత్వ పనితీరుపై హుడా నిప్పులు కురిపిస్తుండగా, సెల్జా మాత్రం గ్రూపులు, కులాలకు అతీతంగా పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్!