మనో బలం ముందు వయో భారం ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించారు కేరళ తిరువనంతపురానికి చెందిన భగీరథీ అనే బామ్మ.105 ఏళ్ల లేటు వయస్సులో బడిబాట పట్టి చదువును ఔపోసన పట్టారు. అందరి చేత ఔరా అనిపించారు. ఈ ముదిమి వయస్సులో కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్షరాస్యత పరీక్షకు హాజరై సంచలనం సృష్టించారు.
తల్లి మరణంతో భగీరథీ బామ్మ చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు 30 ఏళ్ల వయస్సులోనే భర్త మరణించారు. ఆమెకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారి పెంపకం బాధ్యతల కారణంగా చదువుకోవాలన్న కల నెరవేరలేదు.
ఏంటి ఈ పరీక్ష?
రాష్ట్రంలో నిరక్షరాస్యతను పూర్తిగా తుడిచిపెట్టడానికి 'కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్' అనే కార్యక్రమం చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ మిషన్ ద్వారా చదువు నేర్చుకున్నారు భగీరథీ. 4వ తరగతి పరీక్షకు హాజరయ్యారు.
"భగీరథీ అమ్మ రాయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఆమె చిన్న కుమార్తె సాయంతో ఈ పరీక్షలను మూడు రోజులు రాశారు. పర్యావరణం, లెక్కలు, మలయాళం ప్రశ్నాపత్రాలు రాశారు. ముదిమి వయస్సులోనూ ఆమెకు అద్భుత జ్ఞాపక శక్తి ఉంది. కంటి చూపు బాగుంది. ఆమె 9వ ఏటనే మూడో తరగతి చదువుతుండగా చదువు మానేసింది.
-వసంత్ కుమార్, అక్షరాస్యత మిషన్ అధికారి
గతంలో కార్తీకేయని అనే 96 ఏళ్ల బామ్మ ఈ పరీక్షకు హాజరై నూటికి తొంభై ఎనిమిది మార్కులు సాధించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతులు మీదుగా ఘన సత్కారం అందుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును భగీరథీ తిరగరాశారు.
ఇదీ చూడండి : లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు