అసోంలో భయంకర తిరుగుబాటు సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్బీ)తో కేంద్రం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్(ఏబీఎస్యూ) కూడా ఈ త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామి అయింది.
అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, బోడో ప్రతినిధులు, ఏబీఎస్యూ ప్రతినిధులు... దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒడంబడికతో బోడోలకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
బోడో ఒప్పందంతో చాలా ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించించిందని అమిత్ షా అన్నారు.
" ఈ ఒప్పందం అసోం ప్రజలు, బోడోల బంగారు భవితకు దోహదపడుతుంది. 1972 నుంచి ఏబీఎస్యూ ఉద్యమాన్ని చేపట్టింది. ఆందోళనలు మొదట్లో ప్రజాస్వామ్యయుతంగా జరిగినా 1987 నుంచి హింసాత్మకంగా మారాయి. అసోంలో అశాంతి నెలకొల్పి ఆందోళనలు ఉద్ధృతం చేశారు. బోడోల ఆందోళనల్లో ఇప్పటివరకు 2823 మంది పౌరులు మరణించారు. 249మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. బోడో వర్గాలకు చెందిన 949మంది మృతి చెందారు. ఉద్యమం చేపట్టిన వారే ఈరోజు ఒప్పందానికి అంగీకరించారు. 2003 నాటి ఒప్పందానికి మార్పులు చేసి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమస్యను పరిష్కరించింది. "
-అమిత్ షా, హోంమంత్రి
అసోం బంద్..
బోడో తిరుగుబాటుదారులతో కేంద్రం ఒప్పందాన్ని నిరసిస్తూ అసోంలో 12 గంటల బంద్ పాటిస్తున్నారు. బోడోయేతర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్ కారణంగా ఉదల్‌గురి, చిరాగ్, బకాస్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. కొన్నిచోట్ల ఆందోళనకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. టైర్లు కాల్చి రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: ఆవు కోసం పులితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు