దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలకు కారణమైన పౌరసత్వ చట్టంపై అనుమానాల నివృతికి ప్రయత్నించింది కేంద్రప్రభుత్వం. 1987 కన్నా ముందు జన్మించిన వారు, వారి సంతానం... చట్టప్రకారం భారత పౌరులేనని స్పష్టం చేసింది. పౌరసత్వ చట్టం విషయంలో వీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు భరోసా ఇచ్చారు.
అసోంలో మాత్రం 1987కి బదులు 1971ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకోనున్నారు.
సలహాల స్వీకరణకు సిద్ధం
పౌరసత్వ చట్టం అమలు పూర్తిగా కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశమని దిల్లీ వర్గాలు పునరుద్ఘాటించాయి. కొత్త చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలుకానివ్వమని భాజపాయేతర ముఖ్యమంత్రులు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు స్పష్టత ఇచ్చాయి.
"చట్టం అమలు కేంద్రం పరిధిలోని అంశం. అమలు ప్రక్రియలో ఎవరు భాగస్వాములు కావాలో త్వరలో నిర్ణయిస్తాం. మొత్తం ప్రక్రియ డిజిటల్ పద్ధతిలో సులభంగా ఉంటుంది. ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
విస్తృత సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ బిల్లు తీసుకొచ్చాం. కానీ... సవరణను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది. అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పన కోసం ఎవరైనా తమ సలహాలు, సూచనలు అందించవచ్చు."
-కేంద్రప్రభుత్వ వర్గాలు
ఇదీ చూడండి: 'పౌర'సెగ: పోలీసులకు గులాబీలు ఇచ్చి నిరసన వ్యక్తం