అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్న జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది కేంద్రం. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఇరు ప్రాంతాల వారికి జీతభత్యాలు పెంచనుంది. వేతన పెంపునకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర హోం, సిబ్బంది వ్యవహారాల శాఖమంత్రి అమిత్‌షా ఆమోద ముద్ర వేశారు. అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వేతన పెంపుతో కశ్మీర్లో పనిచేస్తున్న 4.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనుంది. నూతన వేతన సవరణ ప్రకారం ఉద్యోగుల పిల్లల చదువులకు, హాస్టల్ వసతికి, ప్రయాణానికి, వైద్యం సహా వివిధ సదుపాయాలకు అలవెన్సులు అందిస్తారు. ఇందుకు రూ. 4800 కోట్లు ఖర్చు అవనున్నాయని సమాచారం.
ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్రం. ఈ అంశమై ఆగస్టు 8న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు వేతన పెంపును వర్తింపజేస్తామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రధాని హామీ మేరకు కేంద్రపాలిత ఏర్పాటుకు ముందు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చూడండి: నోబెల్ విజేత అభిజిత్‌పై మోదీ ప్రశంసల జల్లు