పౌరసత్వ చట్ట సవరణపై తనదైన శైలిలో ఎన్డీఏ ప్రభుత్వానికి సవాలు విసిరారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో సీఏఏ, ఎన్ఆర్సీపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఓడిపోతే అధికారం నుంచి భాజపా దిగిపోవాలన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా కోల్కతాలోని రాణి రష్మోణి అవెన్యూలో బహిరంగ సభ నిర్వహించారు దీదీ. 'పౌర' నిరసనలను హిందూ-ముస్లిం మధ్య పోరాటంగా భాజపా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 1980లో ఆవిర్భవించిన భాజపా.. 1970 నాటి పౌరుల పత్రాలను అడుగుతోందంటూ ఎద్దేవా చేశారు.
ఆంక్షలు విధించినా ఆందోళనలను అడ్డుకోవటంలో భాజపా విజయం సాధించలేదని స్పష్టం చేశారు. మెజారిటీ ఉందన్న కారణంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించటం కుదరదని మమత హెచ్చరించారు. బంగాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు దీదీ.
ఇదీ చూడండి: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పాక్ తీర్మానం