భూగర్భం నుంచి తవ్వితీసిన ఇంధన వనరుల్ని మండించి.. చివరికి ఆ భూమికే సెగ పుట్టిస్తున్నాం. నేటి వెలుగుల కోసం రేపటి భవితను చీకట్లోకి నెట్టుకుంటున్నాం. కర్బన ఉద్గారాల సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. దాన్నుంచి బయటపడాలంటే కాలుష్యం వెదజల్లని శుద్ధ ఇంధనాల వినియోగమే అత్యుత్తమ పరిష్కారమని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఇలాంటి ఇంధనాల్ని పెద్దఎత్తున ఉత్పత్తిచేయడం రాబోయే దశాబ్దకాలంలో ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు. దాన్ని ఎలా అధిగమిస్తాం?
బొగ్గు, పెట్రో ఇంధనాలతో ముప్పు ఏమిటి?
ప్రపంచంలో ఇప్పటికీ బొగ్గు, పెట్రోలియం, గ్యాస్‌లతో ఉత్పత్తి చేస్తున్న ఇంధనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని విపరీతంగా మండిస్తుండటంతో ఏటా 5,500 కోట్ల టన్నుల వరకు కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఫలితంగా భూగోళం వేడెక్కుతోంది. పర్యావరణం దెబ్బతింటోంది.
- వాతావరణంలో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వృద్ధి చెందితే సముద్ర మట్టాలు 10 సెం.మీ. పెరుగుతాయి.
- అప్పుడు ఏకంగా 2.1 కోట్ల మంది తీరప్రాంత ప్రజలు నిరాశ్రయులవుతారు.
- ప్రతి హెక్టారుకు గోధుమలు 3%, వరి 4% దిగుబడులు తగ్గుతాయి. ఇది ఆహార కొరతకు దారి తీస్తుంది.
- ప్రజలకు మేలుచేసే 5% క్రిమి కీటకాలు కనుమరుగు అవుతాయి. అదే జరిగితే వ్యాధులు విజృంభిస్తాయి.
- ప్రపంచంలో తాగునీటి లభ్యత 4 నుంచి 9% తగ్గుతుంది.
మనం ఏం చేయొచ్చు?
- శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించాలి. తద్వారా ఆ ఇంధన వనరులపై ఒత్తిడి తగ్గుతుంది.
- ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి, పరిశోధనలపై ప్రభుత్వాలు గణనీయంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది.
- సౌర, పవన విద్యుదుత్పత్తికి ముందుకు వచ్చేవారికి భారీగా రాయితీలు ఇవ్వాలి.
- ఇళ్లపై సౌర ఫలకాల్ని ఏర్పాటుచేసుకుని.. సొంతంగా విద్యుత్తు తయారుచేసుకునే వారికి ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందివ్వాలి. అలా ఉత్పత్తి అయిన విద్యుత్తులో మిగులు ఉంటే.. గ్రిడ్‌కు పంపించవచ్చు.
- బ్యాటరీ సహాయంతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చు.
మనం అడుగేస్తే జరగబోయే అద్భుతాలివీ...
- 2025 నాటికి: హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్న సునీత-రాజేంద్ర దంపతుల కుటుంబం విద్యుత్తు కొనడం ఆపేసి, ఇంటిపై సౌర పలకలతో సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. బల్బు నుంచి కారు వరకు తాము వాడుకోగా మిగిలిన దాన్ని గ్రిడ్‌కు విక్రయిస్తుందికూడా. దీంతో ప్రభుత్వం నుంచి ప్రతినెలా నగదు అందుతుంది.
- 2030: కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన రైతు బెంగళూరులో ఉంటున్న తన కొడుకును చూడటానికి వెళుతూ పప్పు, బియ్యం, కూరగాయలతోపాటు నిండుగా ఛార్జి అయిన 20 కిలోవాట్ల సామర్థ్యమున్న విద్యుత్తు బ్యాటరీని సైతం తీసుకెళతారు. పొలం గట్టున ఉన్న గాలిమర నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్తు అది. తిరిగి వెళ్లేప్పుడు ఆ రైతు ఖాళీ బ్యాటరీని తీసుకెళతారు.
- 2035: దిల్లీ, కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల రోడ్లన్నీ కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండుగా ఉన్నా... పొగ మాత్రం ఎక్కడా కనిపించదు. శిలాజ ఇంధనాలతో నడిచే వాటి స్థానంలో అన్నీ విద్యుత్తు వాహనాలు రావడంతో ప్రజలు హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.
ఇంధన ఉత్పత్తికి ప్రపంచంలో ఏటా ఇంతలా వాడేస్తున్నాం..
బొగ్గు 800 కోట్ల టన్నులు
పెట్రోలియం 400 కోట్ల టన్నులు
గ్యాస్ 1004 కోట్ల టన్నులు
ఇలా చేస్తున్నారు..
సౌరశక్తి : ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో సంప్రదాయ విద్యుత్తును మించి ఇది ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ సౌర పలకల తయారీ ఖర్చును భారీగా తగ్గించారు. వీటిని స్ఫూర్తిగా తీసుకుని భూమిపై ప్రస్తుతం వాడుతున్న విద్యుత్తులో 2030 నాటికి 30 శాతం, 2050 నాటికి 70 శాతం సౌరవిద్యుత్తు ఉండేలా చూడాలనేది ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వాల లక్ష్యం.
పవన విద్యుత్తు : ఇది 98% స్వచ్ఛ, ఆధారపడదగ్గ ఇంధనం. గాలిమరల ఏర్పాటుకు మినహా నిర్వహణకు పెద్దగా ఖర్చు ఉండదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా దీని స్థాపిత సామర్థ్యం 3 రెట్లు పెరుగుతోంది. ఈ విభాగంలో చైనా, అమెరికా, జర్మనీ, స్పెయిన్‌ల తర్వాత భారత్‌ది అయిదో స్థానం. మన దేశంలో 2022 నాటికి పునరుత్పాదక విద్యుత్తు వాటాను 175 గిగావాట్లుగా లక్ష్యం పెట్టుకోగా.. అందులో సౌర-100, పవన-60, బయోగ్యాస్-10, చిన్న జలవిద్యుత్తు కేంద్రాలు-5 గిగావాట్లు.
(1000 మెగావాట్లకు 1 గిగావాట్, 1000 గిగావాట్లకు 1 టెరావాట్)
జల విద్యుత్తు : పునరుత్పాదన రంగంలో జల విద్యుత్తుదీ కీలక పాత్రే. ప్రపంచంలో ఏటా 2700 టెరావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. 66 దేశాలు 50%, 24 దేశాలు 90% దీనిపై ఆధాపడుతున్నాయి. మన దేశ మొత్తం విద్యుత్తు అవసరాల్లో 34% జల విద్యుత్తే తీరుస్తోంది. వివిధ జలాశయాల నుంచి ఏటా 85 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది.
అణు విద్యుత్తు: కేవలం 7వేల టన్నుల యురేనియం నుంచి అన్ని దేశాలకూ ఒక ఏడాదికి సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 444 రియాక్టర్లు పనిచేస్తుండగా మరో 62 నిర్మాణంలో ఉన్నాయి. దేశంలో 22 రియాక్టర్ల నుంచి 7గిగావాట్లు ఉత్పత్తి అవుతోంది. దీన్ని 20 గి.వా.లకు పెంచాలనేది 2020 లక్ష్యం కాగా దాన్ని 2030కు పొడిగించారు.
కేంద్రక సంలీనం: సూర్యునిపై హైడ్రోజన్ సంలీనం ద్వారా అపారశక్తి ఉత్పత్తి అవుతోంది. అదే తరహాలో భూమిపైనా శక్తిని ఉత్పత్తి చేసి, విద్యుత్తుగా మార్చేందుకు ప్రయోగాలు సాగుతున్నాయి. 2030 నాటికి ఇది సఫలమవుతుందని... ప్రపంచానికి ఒక ఏడాదికి సరిపడా కరెంటు తయారీకి కేవలం 867 టన్నుల హైడ్రోజన్ సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: దశాబ్ది సవాల్: కుబేర - కుచేల అంతరం తగ్గేదెలా!