వాడిపారేసిన ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవల అవగాహన కార్యక్రమాలు పెరిగాయి. అయితే ప్లాస్టిక్‌పై దేశవ్యాప్త పోరు ప్రారంభం కాకముందే ఈ దిశగా అడుగులు వేసింది రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా. ప్రతి ఆదివారం జిల్లాలోని పౌరులు సమావేశమై వీధులు, కాలనీల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తుంటారు.
'హెల్పింగ్ హ్యాండ్స్ అల్వార్' అనే స్వచ్ఛంద సంస్థను ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. ఇందులో పెద్దసంఖ్యలో యువకులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.
గత ఐదేళ్లుగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కోసం కృషి చేస్తోంది ఈ 'హెల్పింగ్ హ్యాండ్స్'. ప్రస్తుతం అల్వార్ వెలుపలా ఈ అవగాహన కార్యక్రమాన్ని విస్తరించింది ఈ సంస్థ.
"ఈ సంస్థ స్థాపించి ఐదేళ్లకు పైనే అయింది. ప్రతి ఆదివారం యువకులు బయటకు వచ్చి ఓ ప్రజా స్థలాన్ని శుభ్రం చేస్తాం. ఎక్కడయితే అపరిశుభ్రంగా కనిపిస్తుందో దానిని శుభ్రం చేయడమే మా పని. ఇక్కడి పాలనాయంత్రాంగానికి 'హెల్పింగ్ హ్యాండ్స్' తరఫున ఎన్నిసార్లు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికార యంత్రాంగానికి వస్తోన్న డబ్బులు ఏం చేస్తున్నారో? హెల్పింగ్ హ్యాండ్స్‌లో 250 మంది వరకు సభ్యులు ఉన్నారు. ప్రతి ఆదివారం 20 నుంచి 50 మంది శ్రమదానం చేస్తుంటాం. ఎక్కడైనా అపరిశుభ్రంగా కనిపిస్తే వెళ్లిపోతుంటాం."
-విమల్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు
ఇలా శ్రమదానం ద్వారా శుభ్రం చేసిన చెత్తలోని ప్లాస్టిక్‌ను వేరుచేసి మున్సిపల్ కార్పొరేషన్ వారికి చేరుస్తుంటామని ఈ యువబృందం వెల్లడించింది. శుభ్రం చేసేందుకు అవసరమైన పనిముట్ల కోసం ఈ స్వచ్ఛంద సేవకులు తలా కొంత డబ్బు వేసుకున్నారు.
"ఎంచుకున్న స్థలంలో ఉన్న ప్లాస్టిక్‌ను సమకూర్చి మున్సిపల్ కార్పొరేషన్ వారికి అందిస్తుంటాం. కావలసిన పనిముట్లను హెల్పింగ్ హ్యాండ్స్‌లోనే డొనేషన్ల ద్వారా సమకూర్చుకున్నాం."
-రాజేందర్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు
ఈ అల్వార్ యువకుల ప్రయత్నం ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే దిశగా సానుకూల అడుగని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇదీ చూడండి: విరిగిపడుతున్న మంచు చరియలు.. ప్రజల ఇబ్బందులు