మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై స్తబ్ధత నెలకొన్న సమయంలో తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అర్జీ పెట్టుకున్నాడు. ఈ మేరకు బీడ్ జిల్లా పాలనాధికారికి దరఖాస్తు సమర్పించాడు.

శ్రీకాంత్ విష్ణు గదాలే.. మహారాష్ట్రలోని కేజ్ తాలూకా వాద్మౌలీలో రైతు.

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ కలెక్టర్కు లేఖ రాశాడు శ్రీకాంత్. భాజపా, శివసేన మధ్య సమస్యల పరిష్కారం కుదిరే వరకు తనను సీఎంగా కొనసాగించాలని అందులో పేర్కొన్నాడు.

"పంట కోతకు వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు విధ్వంసం సృష్టించాయి. రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి కోసం భాజపా, శివసేన మధ్య వివాదం కొనసాగుతోంది. వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సీఎం బాధ్యతలను గవర్నర్ నాకు అప్పగించాలి. రైతుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేస్తాను. ఈ లేఖను పాలనవిభాగం విస్మరిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపడతాను. "
-శ్రీకాంత్ విష్ణు గదాలే, మహారాష్ట్ర రైతు
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన భాజపా-శివసేన కూటమిలో చెరిసగం సీఎం పదవి ప్రతిపాదనతో ప్రతిష్టంభన నెలకొంది. దీనితోపాటు మంత్రిత్వ శాఖల్లో 50-50 ఫార్ములా కావాలని శివసేన కోరింది. కానీ భాజపా రెండు డిమాండ్లను తిరస్కరించింది.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'