మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా దేవేంద్ర ఫడణవీస్‌ను మరోసారి ఎన్నుకున్నారు. ముంబయిలోని విధాన్ భవన్లో భేటీ అయిన నూతన శాసనసభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో ఇటీవలే ఎన్నికైన 105 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరితోపాటు కేంద్ర ప్రతినిధులుగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ ఉపాధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఖన్నా ఉన్నారు. ఫడణవీస్ మినహా మరే పేరు పోటీకి రాలేదని, నాయకుడిగా ఆయననే ఎన్నుకున్నట్లు తోమర్ ప్రకటించారు.
ఫడణవీస్ కృతజ్ఞతలు
మరోసారి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఫడణవీస్.. మిగిలిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకూ ధన్యవాదాలు చెప్పారు.
ప్రభుత్వ ఏర్పాటులో కీలక ప్రక్రియను పూర్తి చేసుకుంది భాజపా. ఇక శివసేనతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను ఎలా ఎదుర్కోవాలో దృష్టి సారించే అవకాశం ఉంది. భాజపా ఎలాంటి వ్యూహాలను అనుసరించనుందోననే ఉత్కంఠ నెలకొంది.