అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్‌తో పాటు మరో 15 దేశాల రాయబారులు కశ్మీర్‌కు చేరుకున్నారు. 370, అధికరణ 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తాజా పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు 16 దేశాల ప్రతినిధులు వచ్చారు. వీరిలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు.
పర్యటన ఇందుకే..
ప్రత్యేక విమానంలో శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న రాయబారులకు కేంద్రపాలిత ప్రాంత అధికారులు ఘన స్వాగతం పలికారు. కశ్మీర్లో పర్యటించి.. స్థానికుల ప్రస్తుత పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్న తరువాత రేపు భారత శీతాకాల రాజధాని జమ్ములో పర్యటిస్తారు రాయబారులు.
భద్రతకు సంబంధించిన విషయాలను వారికి వివరిస్తున్నాయి భారత భద్రతా దళాలు. ఈ పర్యటనలో పొరుగు దేశం పాకిస్థాన్.. కశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని విదేశీ రాయబారులకు తెలియజేస్తాయి.
అగ్రరాజ్యంతో పాటు.. బంగ్లాదేశ్, వియత్నాం, నార్వే, మాల్దీవులు, దక్షిణ కొరియా, మోరాకో, నైజీరియా తదితర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు.
వీరిని కలుస్తారు...
జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ముతో విదేశీ ప్రతినిధుల బృందం రేపు భేటీ కానున్నట్లు వెల్లడించారు అధికారులు. తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు జమ్ముకశ్మీర్‌ను సందర్శించాలని చాలా దేశాలు కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఐరోపా సమాఖ్య దేశాలు మాత్రం కశ్మీర్‌ను మరికొద్ది రోజుల తర్వాత సందర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబుబా ముఫ్తిలతో సమావేశం కావాలని ప్రతినిధుల బృందం కోరుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌ను విదేశీ ప్రతినిధులు బృందం సందర్శించడం ఇది రెండోసారి. గతంలో 23 మంది ఐరోపా సమాఖ్య ఎంపీలు ఇక్కడ పర్యటించారు.