మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన భారతీయ జనతాపార్టీ సంతోషం.. ముణ్నాళ్లకే ముగిసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు.
ముంబయిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో అజిత్ పవార్ కూటమి నుంచి వైదొలగినందున తమ వద్ద ప్రభుత్వానికి సరిపడా సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అజిత్ పవార్ ఆయనకు చెప్పినట్లు తెలిపారు ఫడణవీస్.
శివసేనపై తీవ్ర విమర్శలు
శివసేనపై తీవ్ర విమర్శలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. ముఖ్యమంత్రి పదవి కోసం తమను బెదిరించిందని.. అధికారం దాహంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపి సోనియా గాంధీ పేరున ప్రతిజ్ఞ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుక వినిపిస్తుందని ప్రకటించారు.
"ప్రజలు మహాకూటమి(భాజపా-శివసేన)కే పట్టం కట్టారు. భాజపాకు అత్యధికంగా 105 సీట్లు వచ్చాయి. కూటమి విజయం భాజపా కారణంగా వచ్చిందే. ఎందుకంటే భాజపా పోటీ చేసిన 70శాతం స్థానాల్లో గెలిచింది. ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇస్తే వారితో కలుస్తామని శివసేన మాకు ఎన్నికల ఫలితాల ముందే చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తుందని చాలా కాలం వేచి చూశాం. కానీ వారు ఎన్సీపీ-కాంగ్రెస్‌తో చర్చలు జరిపారు. మాతోశ్రీ(ఠాక్రేల అధికారిక నివాసం) దాటి బయటకు రాని వారు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గడపగడపకూ తిరుగుతున్నారు."
-దేవేంద్ర ఫడణవీస్
అజిత్ పవార్‌తో కలిసి గత శనివారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఫడణవీస్. అయితే భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ వేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. రేపటిలోపు శాసనసభలో బలపరీక్ష ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ పదవులకు ఫడణవీస్, అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.