దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. జనవరి తర్వాత నేడు తొలిసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచీ సుమారు 50 పాయింట్లు పెరిగి 459కి చేరింది.
దిల్లీలోని 37 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ప్రమాదకర స్థాయినే సూచించాయి. బవాన... 497 పాయింట్లతో అత్యంత కాలుషితమైన ప్రాంతంగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో దిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (487), వాజిర్పుర్ (485), ఆనంద్ విహార్ (484), వివేక్ విహార్ (482) ఉన్నాయి. కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గాలి నాణ్యత సూచీలు ప్రమాదకర స్థాయిలోనే 48 గంటల పాటు ఉంటే.. అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర కాలుష్య నివారణ బోర్డు అధికారులు తెలిపారు. ప్రధానంగా సరి-బేసి కార్ల విధానం, నగరంలోకి ట్రక్కుల నిషేధం, నిర్మాణ రంగ పనుల నిలిపివేత, పాఠశాలల మూసివేత వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
మాస్క్‌లు పంపిణీ...
దిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు సుమారు 50 లక్షల 'ఎన్95' మాస్క్‌లను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టటం కారణంగానే దిల్లీలో కాలుష్యం ఎక్కువవుతోందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విద్యార్థులు లేఖలు రాయాలని సూచించారు కేజ్రీవాల్. పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను విమర్శించారు.
ఇదీ చూడండి: దిల్లీ విమానాశ్రయంలో 'ఆర్డీఎక్స్' కలకలం