పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనతో దేశ రాజధాని దిల్లీ మహానగరం మరోమారు రణరంగంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. పౌర చట్టానికి వ్యతిరకేంగా, జామియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్శిటీలో పోలీసుల చర్యను నిరసిస్తూ.. విద్యార్థులు, కార్యకర్తలు ర్యాలీలకు పిలుపునిచ్చిన క్రమంలో పలు ప్రాంతాంల్లో ఆంక్షలు విధించారు అధికారులు.
ఎర్రకోట ప్రాంతంలో 144 సెక్షన్..
విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో ఎర్రకోట ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు అధికారులు. అయితే.. ఆంక్షలు లెక్కచేయకుండా జామియా, జేఎన్యూ, దిల్లీ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఎర్రకోట ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంక్షలను లెక్క చేయకుండా ఎర్రకోట ప్రాంతంలో ఆందోళనకు దిగిన వందల మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్థులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇందులో స్వరాజ్య అభియాన్ అధినేత యోగేంద్ర యాదవ్ ఉన్నారు.
వామపక్ష నేతల అరెస్ట్..
సెంట్రల్ దిల్లీలోని మండి హౌస్ ప్రాంతంలో సంయుక్త మార్చ్ నిర్వహించాయి లెఫ్ట్ పార్టీలు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు డి. రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్ బసు, బృందా కారత్ సహా ఇతరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
16 మెట్రో స్టేషన్ల మూసివేత..
పౌర చట్టం వ్యతిరేక అల్లర్లు ఉద్రిక్తంగా మారిన క్రమంలో దిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ భద్రత చర్యలు చేపట్టింది. నగరంలోని 16 మెట్రో స్టేషన్లలోని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేసింది.
సీలంపుర్లో మరో 12 మంది అరెస్ట్
పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత మంగళవారం ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ఐదుగురు జఫ్రబాద్, నలుగురు దయాల్ పుర్ కేసుకు సంబంధం ఉన్నవారిగా పేర్కొన్నారు. గత మంగళ, బుధవారాల్లో 9 మందిని అరెస్ట్ చేశారు.
భారీగా ట్రాఫిక్ జాం
ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దిల్లీ-గుర్గావ్, దిల్లీ గేట్-జీపీఓ, సుభాష్ మార్గ్, పీలి కోఠి, శ్యామ ప్రశాద్ ముఖర్జీ మార్గ్, ఎర్రకోట, పాత దిల్లీ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేయడం వల్ల మరింత ఆలస్యమవుతుంది.
ఇదీ చూడండి: భారత్లో శాంతిని చూడలేకే చొరబాట్లు: అమిత్ షా