హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే నిందితులకు తక్షణమే కఠినంగా శిక్షించాలంటూ దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. తెలంగాణ బిడ్డ దిశ అత్యాచార ఘటన ఎంతో కలిచి వేసిందని.. దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు భరోసా ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని స్వాతి మాలివాల్ డిమాండ్ చేస్తున్నారు.
"హైదరాబాద్‌లో జరిగిన సంఘటన షాక్‌కు గురిచేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది కేవలం ఈ ఇద్దరు అమ్మాయిల గురించి కాదు. దిల్లీలో 8 నెలల చిన్నారిపై, అలీగఢ్‌లో 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారాలు జరిగాయి. ఈ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఘటనలు వినకూడదని... ఆమరణ దీక్షకు కూర్చున్నాను. గత మూడేళ్లలో దిల్లీ మహిళా కమిషన్, 55 వేల ఘటనల గురించి తెలుసుకుంది. ఈ ఘటనల్లోని బాధితుల బాధ... నా బాధ. ఇక నేను దీన్ని ఉపేక్షించబోను. నేను గతేడాది కూడా నిరాహార దీక్షకు కూర్చున్నాను. నా నిరాహార దీక్ష 10 వ రోజున... చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డ వారికి 6 నెలల్లోపు మరణశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది జరిగి ఒకటిన్నర సంవత్సరాలైంది. ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. చట్టాలు అమలు కావడం లేదు. ప్రభుత్వం చట్టాలను అమలు చేయాలని కోరుకుంటున్నాను. దానితో పాటు పోలీసుల సంఖ్యను పెంచాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. పోలీసుల వద్ద జవాబుదారీతనం పెరగాలి. ఇదే నా డిమాండ్. నిర్భయ నిధిని సరైన పద్ధతిలో వినియోగించే వరకు, నిర్భయ దోషులను ఉరి తీసేంత వరకు నేను దీక్ష విరమించను."
-స్వాతి మాలివాల్, దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్