'దిశ' నిందితులకు సత్వరమే శిక్ష పడాలని యావత్ దేశం ముక్తకంఠంతో నినదిస్తోంది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారు. నిందితులను ఆరు నెలల్లోగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
"రాజస్థాన్‌లో ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆమె కళ్లు కూడా బయటకి వచ్చాయి. హైదరాబాద్‌లో ఓ వైద్యురాలిని అత్యాచారం చేసి కాల్చేశారు. చాలా మంది ఇందులో భాగమయ్యారు. ఇప్పుడు ఇలా ఓ ఘటన జరిగింది. తర్వాత ఇంకొకటి, మరొకటి జరుగుతాయి. ఈ దేశంలో ఇంతే. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ దేశంలోని అనేకమంది ఆడబిడ్డలు చనిపోతున్నారు. వారి మృతదేహాలను చూస్తే మాకు చాలా భయమేస్తుంది. నాతో పాటు దేశం మొత్తం ఎంతో ఆగ్రహంగా ఉంది. నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా."
-- స్వాతి మాలివాల్, దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు
అడ్డుకున్న పోలీసులు...
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్న వెంటనే పోలీసులు తనను అడ్డుకున్నట్టు ఆరోపించారు డీడబ్ల్యూసీ అధ్యక్షురాలు. అనుమతి లేదంటూ తనను పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఓ సాధారణ మహిళను చూసి పోలీసులు, కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు స్వాతి.
మోదీకి లేఖ...
మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు స్వాతి. నిందితులకు ఆరు నెలల్లో ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. చట్టాలను రూపొందిస్తే సరిపోదని.. వాటిని అమలు కూడా చేయాలన్నారు. పోలీసు వనరులను పెంచాలని అభ్యర్థించారు.
బాలికలపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా గతంలో 10 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు స్వాతి.
ఇదీ చూడండి- లైంగిక దాడుల కేసుల్లో ఏం చేస్తున్నారు?: ఎన్హెచ్ఆర్సీ