అసోంలో ఏనుగుల బెడద ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి పంటపొలాలపై గుంపులు గుంపులుగా విరుచుకుపడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చేవి. అందుకే వాటి ముప్పు నుంచి తప్పించుకోవడానికి వినూత్న ఆలోచన చేశారు నగాంవ్కు చెందిన దంపతులు దులు బోరా, మేఘనా మయూర్.
నగాంవ్ జిల్లా అటవీ ప్రాంతాల్లో ఏనుగుల ఆవాస ప్రాంతాలు కుచించుకుపోవటం, ఆహార కొరత వంటి సమస్యలతో అవి పంటపొలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పంటలు నాశనం చేయడమే కాక.. ఎందరో ప్రాణాల్ని బలిగొంటున్నాయి. వీటి పరిష్కారం కోసం అటవీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది.
ఏనుగుల కోసం ప్రత్యేక పంట..
ఈ ఏనుగుల దాడిని నియంత్రించేందుకు ప్రకృతి శాస్త్రవేత్తలైన బోరా, మేఘనా కలిసి కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ఏనుగులు ఆహరం కోసం పొల్లాలోకి ప్రవేశించకుండా ఉండటానికి అవి ఉన్న పరిసర ప్రాంతాల్లో 'కర్బీ' అనే పర్వత ప్రాంతం మీద వాటి కోసం ప్రత్యేకంగా కొంత భూమిని కేటాయించి పంట పండించటం ప్రారంభించారు. దీని కోసం స్థానిక రైతులతో పాటు ఓ ఎన్జీఓ సహాయం తీసుకున్నారు.
వరి, గడ్డి, తదితర చెట్లను పెంచడం వంటివి చేశారు. ఫలితంగా ఏనుగుల గుంపు ఆహారం కోసం వెతుక్కోకుండా వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పొలాల్లోకి వెళ్లటం ప్రారంభించాయి.
స్థానికులకు ఉపశమనం
ఈ పద్ధతి వల్ల గతంతో పోలిస్తే ఏనుగుల బెడద చాలా వరకు తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి ఓ ఆలోచన పెద్ద సమస్య నుంచి బయటపడేలా చేయడానికి ఉపయోగపడింది.
ఇదీ చూడండి : పాపం పులి... ఎరక్కపోయి ఇరుక్కుపోయింది.!