అధికార వాంఛతో నిరంకుశ పాలన సాగిస్తున్న ప్రభుత్వం నుంచి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని విపక్షాలు ప్రతినబూనాయి. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపాపై ఈమేరకు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నిరసనబాట పట్టాయి.
'మహా'రాజకీయంపై నిరసన
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించాయి. అంబేడ్కర్ విగ్రహం ముందు ఉమ్మడిగా ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐ, పీపీఎం, ఐయూఎమ్ఎల్, శివసేన నేతలు పాల్గొన్నారు.
సోనియా నేతృత్వంలో..
రాజ్యాంగ దినోత్సవాన్ని బహిష్కరించాలన్న కాంగ్రెస్ నిర్ణయానికి మొదటగా శివసేన మద్దతు పలికింది. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వం వహించారు. రాజ్యాంగం పీఠికను స్వయంగా చదివి వినిపించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉండాలని సంకల్పించారు.
ప్రియాంక ట్వీట్
"ధనబలం, మందబలాన్ని ఎదుర్కొనేందుకు.. రాజ్యాంగం ముందు తల వంచితే సరిపోదు. రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు గట్టిగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేయాలి. జై రాజ్యాంగం, జై హింద్."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: భారత దేశ ప్రజలమైన మేము...